ఉత్తరాఖండ్లో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆలయంలోకి వెళ్లినందుకు ఓ దళిత యువకుడిని కాల్చిన కర్రతో చితకబాదారు కొందరు వ్యక్తులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను అరెస్ట్ చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. ఆయుష్(22) అనే యువకుడు బాయిలోల్ గ్రామంలో నివసిస్తున్నాడు. జనవరి 9న మోరీ ప్రాంతంలోని సాల్రా గ్రామంలో ఉన్న ఆలయంలోకి దేవుడ్ని ప్రార్థించడానికి వెళ్లాడు. దీన్ని గమనించిన కొందరు వ్యక్తులు కోపోద్రిక్తులయ్యారు. అతడిపై దాడి చేశారు. అనంతరం యువకుడిని కట్టేసి.. కాల్చిన కర్రతో రాత్రంతా చితకబాదారు.
గుడిలోకి వెళ్లాడని దళిత యువకుడిపై దారుణం.. కాల్చిన కర్రతో రాత్రంతా.. - ఉత్తరాఖండ్లో దళితుడిపై కాల్చిన కర్రలతో దాడి
దళిత యువకుడు గుడిలోకి ప్రవేశించాడని అతడిపై దాడి చేశారు కొందరు దుండగులు. అనంతరం అతడ్ని కట్టేసి కాల్చిన కర్రలతో చితకబాదారు. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తర్వాత ఏమైందంటే..
జనవరి 10న ఆయుష్ను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అతడి కుటుంబుసభ్యులు తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి మరో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు. గుడిలోకి వెళ్లినందుకే కొందరు వ్యక్తులు తనపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కాగా, దాదాపు 100 నుంచి 150 మంది పోలీస్ స్టేషన్కు చేరుకుని దళిత యువకుడికి మద్దతుగా నినాదాలు చేశారు. యువకుడి ఫిర్యాదు ఆధారంగా ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారిపై ఎస్/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను సంబంధిత పోలీస్ స్టేషన్ సీఐకు అప్పగించారు.
ఈ ఘటనపై షెడ్యూల్డ్ కులాల కమిషన్ స్పందించింది. విషయం తెలుసుకున్న కమిషన్ సభ్యుడు అంజుబాలా జనవరి 16న ఉత్తరకాశీ జిల్లాకు వెళ్లనున్నారు. ఘటన గురించి అధికారులతో మాట్లాడనున్నారు. జిల్లా స్థాయి అధికారులతో చర్చించనున్నారు.