DA Hike For Railway Employees : దీపావళి పండగ సందర్భంగా భారతీయ రైల్వే తమ ఉద్యోగులకు తీపికబురు చెప్పింది. రైల్వేలో పనిచేస్తున్న వారికి 4% డియర్నెస్ అలవెన్స్(డీఏ)ను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరిగిన ఈ డీఏ 2023, జులై 1 నుంచి అమల్లోకి వచ్చింది. తాజా పెంపుతో ప్రస్తుతం 42 శాతంగా ఉన్న డీఏ 46 శాతానికి పెరిగింది. కాగా, ప్రభుత్వ ఉద్యోగులకు 4 శాతం డీఏ పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన ఐదు రోజుల తర్వాత ఈ డీఏ పెంపు ప్రకటన వెలువడింది. ఈ మేరకు రైల్వే బోర్డు జనరల్ మేనేజర్, ఆల్ ఇండియా రైల్వేస్ అండ్ ప్రొడక్షన్ యూనిట్ల చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లకు అక్టోబర్ 23న ఉత్తర్వులను జారీ చేసింది కేంద్రం.
ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల నుంచి ఉద్యోగులను రక్షించడమే లక్ష్యంగా వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల డీఏను పెంచిందని రైల్వే ఉద్యోగుల సంఘం నేతలు చెబుతున్నారు. ఇక ఈ తాజా ఉత్తర్వులతో రైల్వే ఉద్యోగులు తదుపరి నెల(నవంబర్)లో వచ్చే వేతనంలో ఈ డీఏను(జులై నుంచి) పొందనున్నారు.
"4 శాతం పెరిగిన డీఏ 2023 జులై 1 నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో ప్రస్తుతం బేసిక్ పేలో 42 శాతంగా ఉన్న DA 46 శాతానికి పెరిగినట్లయింది. వీరికి చెల్లించాల్సిన డియర్నెస్ అలవెన్స్‌ను రానున్న నెలలో చెల్లిస్తాము. దీపావళి పండుగ సందర్భంగా ఈ డీఏ పెంపు నిర్ణయాన్ని రైల్వే యూనియన్లు స్వాగతించాయి. ప్రభుత్వం ఆమోదించిన 7వ సీపీసీ సిఫార్సు ప్రకారం డ్రా చేసుకునే వేతనాన్ని బేసిక్ పేగా వివరించింది."
- రైల్వే బోర్డు జనరల్ మేనేజర్