నివర్ అతి తీవ్ర తుపానుగా తమిళనాడు, పుదుచ్చేరి వైపుగా దూసుకువస్తోంది. సముద్రంలో అనువైన ఉష్ణోగ్రతలు , గాలిలో తేమ అందుబాటులో ఉండటం వల్ల అంతకంతకూ బలపడుతూ తీరం వైపుగా వస్తోందని వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. బుధవారం సాయంత్రం కరైకల్, మామళ్లపురం(మహాబలిపురం) మధ్య తీరాన్ని తాకుతుందని, ఆ సమయంలో గాలుల ఉద్ధృతి గంటకు 120-145 కి.మీ. ల మధ్య ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
తుపాను తీరం దాటే సమయంతో పాటు 26, 27న సైతం తమిళనాడులోని కడలూరు, విల్లుపురం, కళ్లకురిచ్చి జిల్లాలు, పుదుచ్చేరిలో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. ఆంధ్ర ప్రదేశ్లోని దక్షిణ కోస్తాంధ్ర , రాయలసీమ జిల్లాల్లో, ఆగ్నేయ తెలంగాణలోని పలు ప్రాంతాల్లోనూ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. తుపాను తీరం దాటినప్పటికీ 26, 27 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. దక్షిణ కర్ణాటకపైనా కొంత వరకు ప్రభావం ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. గతంలో వచ్చిన గజ కంటే నివర్ ప్రభావం తక్కువగానే ఉంటుందని చెన్నై వాతావరణ డైరెక్టర్ బాలచంద్రన్ ప్రకటించారు.
ఫోన్లో మాట్లాడిన మోదీ...