బంగాళాఖాతం తీరంవైపు దూసుకొస్తున్న యాస్ తుపాను మరో 12 గంటల్లో అతితీవ్ర తుపానుగా మారనుందని వాతావరణ శాఖ మంగళవారం హెచ్చరించింది. తూర్పు-మధ్య బంగాళాఖాతం నుంచి తుపాను.. ఉత్తర-వాయవ్య దిశగా గంటకు 9 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోందని పేర్కొంది. ఈ తుపాను బుధవారం సాయంత్రం ఉత్తర ఒడిశా-బంగాల్ తీవ్ర ప్రాంతాలను తాకుతుందని అంచనా వేసింది.
ఒడిశాలోని బాలేశ్వర్ వద్ద తుపానుతీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. పారాదీప్‌కు తూర్పు ఆగ్నేయ దిశగా 320 కిలోమీటర్ల దూరంలో తుపాను ఉన్నట్లు తెలిపింది. తుపాను ప్రభావానికి గాలులు గంటకు 101 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నట్లు వెల్లడించింది. తీరం దాటే సమయంలో గాలుల వేగం గంటకు 185 కిలోమీటర్లు ఉండే అవకాశం ఉందని పేర్కొంది.