బంగాల్లో యాస్ తుపాను ముప్పు అధికంగా ఉండే కోల్‌కతాతో పాటు.. ఉత్తర, దక్షిణ 24పరగణాల జిల్లా అటవీ ప్రాంతాల్లో 16 సహాయక బృందాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇవి స్థానిక పౌర సంస్థలు సహా.. కోల్‌కతా మున్సిపాలిటీతో కలసి సహాయ చర్యల్లో పాల్గొంటాయని వివరించారు. తుపాను కారణంగా పడిపోయిన చెట్ల తొలగింపు సహా.. జంతువులకు సంబంధించిన సహయక చర్యలు చేపడతాయని సీనియర్ అటవీ అధికారి పేర్కొన్నారు.
సుందర్‌బన్ సమీప గ్రామాల్లోకి పులులు వెళ్లకుండా ఈ బృందాలు పర్యవేక్షిస్తాయి. ఇందుకోసం 5 కి.మీ మేర వెదురు ఫెన్సింగ్‌ను సిద్ధం చేసింది అటవీ శాఖ. అంతేగాక బోన్లు, మత్తుమందులను సమకూర్చుకుంది. ఇటీవలి సర్వేల ప్రకారం.. సుందర్బన్లో రాయల్ బెంగాల్ టైగర్స్ సంఖ్య 96కి చేరింది. ఇక సింహాలు, పులులు, చిరుత పులులు, ఏనుగుల సంరక్షణ కోసం సైతం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు అలీపూర్ జూ డైరెక్టర్ ఆశిస్ సమంతా తెలిపారు.
అలాగే.. తాచు, అనకొండ వంటి పాములను పెట్టెల్లో భద్రపరచిన జూ సిబ్బంది.. పక్షులను పెద్ద బోనుల్లో సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నారు.
1876 లో ఏర్పాటైన అలీపోర్ జంతుప్రదర్శనశాలలో సుమారు 1,100 జంతువులు ఉన్నాయి.