అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా తుపానుగా మారింది. 'తౌక్టే'గా వ్యవహరిస్తున్న ఈ తుపాను అమిని దీవికి 160 కిమీ ఈశాన్య దిశగా కేంద్రీకృతమైందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. ఇది మరింత బలపడి మరో 12 గంటల్లో తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించి తౌక్టే తుపాను మరింత బలపడుతుందని ఐఎండీ అంచనా వేసింది. అనంతరం మరో 12 గంటల్లో అతి తీవ్ర తుపానుగా మారుతుందని హెచ్చరించింది.
ఈ నెల 18న మధ్యాహ్నం 2.30 నుంచి రాత్రి 8.30 మధ్య తుపాను గుజరాత్ వద్ద తీరం దాటనుందని ఐఎండీ తెలిపింది. తీరం దాటేప్పుడు 150-175 కి.మీ. వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
రాష్ట్రాలు అప్రమత్తం
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో తుపానును ఎదుర్కొనేందుకు రాష్ట్రాలన్నీ సన్నద్ధమవుతున్నాయి. తూర్పు తీర ప్రాంత రాష్ట్రాలైన కేరళ, మహారాష్ట్ర, గుజరాత్ సహాయక చర్యలకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ప్రభావిత జిల్లాలకు హై అలర్ట్ జారీ చేశాయి.
తుపాను కారణంగా కేరళలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం మొదలైన ఈ వర్షాలు ఇంకా కొనసాగుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులకు చెట్లు విరిగిపడ్డాయి.
మహారాష్ట్ర
తౌక్టే తుపానుపై భారత వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మహారాష్ట్ర సర్కారు అప్రమత్తమైంది. పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని తీర ప్రాంత జిల్లాల అధికారులను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఆదేశించారు. అవసరమైన చోట్ల సహాయక చర్యలు కొనసాగేలా చూడాలని చెప్పారు.
పాల్ఘఢ్, రాయ్‌గఢ్, రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాలపై తుపాను ప్రభావం ఉంటుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఠాక్రే సూచించారు.