గుజరాత్లో తౌక్టే తుపాను బీభత్సం సృష్టించింది. తుపాను వల్ల ఆ రాష్ట్రంలో మొత్తం 53 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు గురువారం తెలిపారు. ఇందులో ఎక్కువ మరణాలు.. గోడలు కూలడం వంటి ఘటనల వల్లే జరిగాయని చెప్పారు.
"తాజాగా లభ్యమైన సమాచారం ప్రకారం.. తౌక్టే తుపాను కారణంగా గుజరాత్ వ్యాప్తంగా 53 మంది ప్రాణాలు కోల్పోయారు."
-హర్షద్ పటేల్, గుజరాత్ విపత్తు నిర్వహణ అధికారి
అతిభీకర తుపానుగా రూపాంతరం చెందిన తౌక్టే.. సోమవారం అర్ధరాత్రి తర్వాత గుజరాత్లోని దీవ్, ఉనాల మధ్య తీరం దాటింది. ఇది మరింత బలహీనపడి వాయుగుండంగా మారిందని అధికారులు తెలిపారు. కాగా.. గుజరాత్లోని తుపాను ప్రభావిత జిల్లాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. బుధవారం ఏరియల్ సర్వే నిర్వహించారు. తక్షణ సాయం కింద రూ.1,000 కోట్లు ప్రకటించారు.
అనంతరం.. తుపాను ధాటికి మరణించిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారాన్ని గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది. క్షతగాత్రులకు రూ.50,000 అందించనున్నట్లు తెలిపింది. ఇది కేంద్ర ప్రభుత్వం అందించే సాయానికి అదనం అని ఆ రాష్ట్ర సీఎం విజయ్ రూపానీ స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:'దేశాల మధ్య పరస్పర సహకారం అవసరం'