Cyclone Michaung Latest News: మిగ్‌జాం తుపాను నెల్లూరు జిల్లాలో తీరం దాటడంతో తీవ్రమైన ఈదురుగాలులు, భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంటకు 90 నుంచి 110 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నాయి. ఉద్ధృతమైన గాలుల వల్ల పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. బాపట్ల జిల్లాలో రెండు గంటలుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చినగంజాం మండలంలో 15 గంటలుగా విద్యుత్ సరఫరా నిలిచింది.
అర్ధరాత్రి తీరం దాటగా: నెల్లూరు, కావలి మధ్య ఇసకపల్లిబంగారుపాలెం వద్ద అర్ధరాత్రి 2.30 గంటలకు తీరం దాటగా నెల్లూరు, బాపట్ల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉద్ధృతమైన గాలుల వల్ల పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. బాపట్ల జిల్లాలో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచింది.
కొంతభాగం సముద్రంలోనే: తీవ్ర తుపాను ఉత్తర దిశగా కోస్తాంధ్ర తీరానికి సమాంతరంగా కదులుతోంది. తీవ్ర తుపానులో కొంతభాగం సముద్రంలో ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. తీవ్ర తుపానులో మరికొంతభాగం భూభాగంపై ఉందని పేర్కొంది. ప్రస్తుతం బాపట్లకు 110 కి.మీ. దూరంలో తీవ్ర తుపాను కేంద్రీకృతం అయి ఉండగా, 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి.
రెడ్ అలెర్ట్ జారీ:తీరం దాటిన అనంతరం 12 గంటల పాటు ఇది తుపానుగా కొనసాగుతుందని ఆ తర్వాత వాయుగుండంగా బలహీనపడుతుందని IMD (India Meteorological Department) తెలిపింది. తీవ్ర తుపాను దృష్ట్యా కోస్తాంధ్ర జిల్లాల్లో రెడ్ అలెర్ట్ జారీ చేశారు. నిజాంపట్నం పోర్టులో 10 నెంబరు ప్రమాద హెచ్చరిక, ఇతర పోర్టుల్లో 7 నెంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. తీరప్రాంత జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశమున్నందున పాఠశాలలకూ సెలవు ప్రకటించారు.
మిగ్‌జాం తుపాన్ ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు-వేల ఎకరాల్లో నేలకొరిగిన వరి