తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దూసుకొస్తున్న మిగ్​జాం తుపాను- ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు

Cyclone Effect in Andhra Pradesh: కోస్తాంధ్ర తీరానికి చేరువగా మిగ్​జాం తుపాను వచ్చింది. కొద్దిసేపట్లో తీవ్ర తుపానుగా మిగ్​జాం బలపడనున్న నేపథ్యంలో తుపాను ఎదుర్కొనేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ విభాగం, అధికారిక యంత్రాంగం హెచ్చరికలు జారీచేసింది.

Cyclone_Effect_in_Andhra_Pradesh
Cyclone_Effect_in_Andhra_Pradesh

By ETV Bharat Telugu Team

Published : Dec 4, 2023, 12:50 PM IST

Updated : Dec 4, 2023, 4:51 PM IST

దూసుకొస్తున్న మిగ్​జాం తుపాను- ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు

Cyclone Effect in Andhra Pradesh: కోస్తాంధ్ర తీరానికి చేరువగా మిగ్‌జాం తుపాను దూసుకొస్తోంది. ప్రస్తుతం నెల్లూరుకు 210, బాపట్లకు 310, మచిలీపట్నానికి 330 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. కాసేపట్లో తీవ్ర తుపానుగా బలపడనుంది. రేపు ఉదయం బాపట్ల తీరానికి సమీపంలో నిజాంపట్నం వద్ద తుపాను తీరం దాటుతుందని విశాఖ వాతావరణ శాఖ అధికారి సునంద తెలిపారు.

రేపు తీరాన్ని దాటే లోపు కోస్తాంధ్ర తీరానికి సమాంతరంగా తీవ్ర తుపాను కదలనుంది. తుపాను తీరాన్ని దాటే సమయంలో 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు విస్తున్నాయి. తీవ్ర తుపాను ప్రభావంతో కోస్తాంధ్రలోని నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి.

ఈ నేపథ్యంలో కలెక్టర్లతో సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సహాయ చర్యలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. అత్యవసరాల కోసం జిల్లాకు రూ.2 కోట్లు ఇవ్వాలని కలెక్టర్లకు ఆదేశించారు. తుపానుప కారణంగా రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా చూడాలన్న సీఎం యుద్ధప్రాతిపదికన ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు.

విస్తరించిన మిచౌంగ్​ తుపాన్​ - ఉప్పొంగిన తిరుపతి జిల్లా స్వర్ణముఖి నది

వర్షాలకు ఇళ్లు దెబ్బతిన్న వారికి రూ.10 వేలు సాయం అందించాలని పేర్కొన్నారు. ప్రాణనష్టం జరగకుండా కలెక్టర్లు, ఎస్పీలు చర్యలు తీసుకోవాలన్న సీఎం ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ క్రమంలో పునరావాస క్యాంపుల్లో అన్ని వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

మిగ్​జాం తుపాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రహదారులు జలమయం కావడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఖరీఫ్ చేతికందిన సమయంలో తుపానుతో రైతుల్లో ఆందోళన నెలకొంది.

శ్రీకాళహస్తి-పల్లం, శ్రీకాళహస్తి-పిచ్చాటూరు రహదారిపై వాగులు పొంగి పొర్లుతుండటంతో అధికారులు రాకపోకలను దారి మళ్లించారు. తుపాను ప్రభావంతో కోనసీమ జిల్లా వ్యాప్తంగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరి పంటలు నేల వాలుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా లక్ష 52వేల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేశారు. దీంట్లో లక్ష ఎకరాల వరకు కోతలు పూర్తయ్యాయి.

తుపాను బాధితులకు అండగా నిలవాలని నేతలకు సీబీఎన్​ పిలుపు - సైక్లోన్​ ఎఫ్టెక్ట్​తో యువగళానికి బ్రేక్​

సుమారు 60 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం రాశుల రూపంలో కల్లాల్లో ఉంది. ధాన్యం తడిసిపోకుండా రైతులు బరకాలు కప్పి రక్షణ చర్యలు చేపట్టారు. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు ధాన్యం నాణ్యత దెబ్బతింటుందని రైతులు మదన పడుతున్నారు.

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో సువర్ణముఖి నదికి వరద ఉద్ధృతి పెరగడంతో లంక మిట్ట కాలనీవాసులను అధికారులు అప్రమత్తం చేశారు. ప్రమాదం పొంచి ఉండటంతో వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు. శ్రీకాళహస్తి-పంగురు రహదారిపై ఈదులు కాలం వద్ద వరద నీరు ప్రవహించడంతో ఓ ప్రైవేట్ బస్సు కాజ్ వేపై ఆగిపోయింది. ట్రాక్టర్ సహాయంతో బస్సును స్థానికులు ఒడ్డుకుచేర్చారు.

తుపాను దృష్ట్యా నెల్లూరు జిల్లా కావలి తీరంలో సహాయక చర్యలపై అధికారులు అప్రమత్తం అయ్యారు. తుమ్మలపెంట, పెదపట్టుపాలెం, కొత్త సత్రం పలు ప్రాంతాల్లో సముద్ర తీరంలో అలలు ఉధృతంగా ఎడిగిపడుతున్నాయి. వేటకు వెళ్లకూడదని అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో మత్స్యకారులు పడవలు, వలలు సురక్షిత ప్రాంతాలకు తరలించుకున్నారు. జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తీర ప్రాంతంలో ఉన్న గ్రామాల్లో పర్యటించారు.

రాష్ట్రంలో తుపాను - పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు రేపు, ఎల్లుండి సెలవులు

గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి ఎడతెరిపి లేని చిరుజల్లులు కురుస్తున్నాయి. తుపాను కారణంగా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల్లో నిర్వహించాల్సిన స్పందన కార్యక్రమాన్ని అధికారులు రద్దు చేశారు. పాఠశాలలకు సెలవు ప్రకటించారు. మిగ్​జాం తుపాను ఎదుర్కొనేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి సూచించారు.

ప్రజలకు అందుబాటులో ఉండేలా సహాయక చర్యలకు కలెక్టర్ కార్యాలయంలో 24 గంటలు పని చేసేలా కంట్రోల్ రూమ్​లు ఏర్పాటు చేశామన్నారు. నదీ పరివాహక, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

తుపాను ప్రభావంతో బాపట్ల జిల్లా నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ వద్ద 7 వ నెంబర్ ప్రమాద సూచికను అధికారులు ఎగురవేశారు. మత్స్య కారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. వేట బోట్లన్నీ ఇప్పటికే ఒడ్డుకు చేరాయి. ఒక్కసారిగా బోట్లన్ని హార్బర్ వద్దకు రావడంతో జెట్టి బోట్లతో కిక్కిరిసింది.

సముద్రం కల్లోలంగా మారి 500 మీటర్ల వరకు అలలు ముందుకు వచ్చాయి. దానవాయిపేట, కృపానగరు, వాడరేవు రామాపురం, సూర్యలంక, దిండి, కొత్తపాలెం, లంకేవాని, దెబ్బరాజు కాలువ, మూలగుంట గ్రామాల నుంచి 850కు పైగా కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు నిర్ణయించారు.

పొంచి ఉన్న తుపాను ముప్పు - వాతావరణశాఖ హెచ్చరికలు జారీ

పునరావాసం కల్పించి ఆహారం త్రాగునీరు అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సముద్రం కల్లోలంగా మారటంతో అధికారులు బీచ్​ను ఖాళీ చేయించి భక్తులను, పర్యాటకులను వెనక్కి పంపించి ఆంక్షలు విధించారు. బాపట్ల సూర్యలంక, వాడరేవు, రామాపురం ఇతర బీచ్‌లలో పోలీసులు భారీ క్యాడ్లు ఏర్పాటు చేశారు. తుపానుదృష్ట్యా జిల్లా వ్యాప్తంగా పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

తిరుపతిలో కురుస్తున్న భారీ వర్షం కారణంగా రేణిగుంట విమానాశ్రయ రన్​ వే పైకి వరద నీరు చేరింది. దీంతో రేణిగుంటకు విమాన రాకపోకలను నిలిపివేశారు. తుపాను దృష్ట్యా విశాఖ-చెన్నై, విశాఖ-హైదరాబాద్‌, విశాఖ-విజయవాడ ఇండిగో విమానాలను రద్దు చేశారు. తిరుపతి నుంచి వెళ్లాల్సిన పలు రైళ్లను రద్దు చేసిన అధికారులు తాత్కాలికంగా దారి మళ్లించారు. విజయవాడ, బెంగళూరు, హైదరాబాద్ ప్రాంతాలకు బస్సు సర్వీసులు కల్పించి రైలు ప్రయాణికులను ఆర్టీసీ బస్సుల్లో తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.

Last Updated : Dec 4, 2023, 4:51 PM IST

ABOUT THE AUTHOR

...view details