తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బలహీనపడ్డ బిపోర్‌జాయ్‌.. తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు! అనేక రైళ్లు రద్దు

Cyclone biparjoy : బిపోర్‌జాయ్‌ తుపాను బలహీనపడిందని ఐఎం​డీ వెల్లడించింది. ఇది అతి తీవ్ర తుపాను నుంచి తీవ్ర తుపానుగా మారిందని తెలిపింది. 150 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తూ.. జూన్ 15న ఇది కచ్ తీరాన్ని తాకే అవకాశముందని పేర్కొంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

cyclone-biporjoy-status-biporjoy-cyclone-weakened-said-imd-india
బిపోర్‌ జాయ్‌ తుపాను

By

Published : Jun 13, 2023, 10:16 AM IST

Updated : Jun 13, 2023, 11:37 AM IST

Cyclone Biparjoy : అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్‌జాయ్‌ తుపాను బలహీనపడిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. అతి తీవ్ర తుపాను నుంచి తీవ్ర తుపానుగా బిపోర్‌జాయ్‌ మారిందని తెలిపింది. ప్రస్తుతం పోరుబందర్​కు నైరుతి దిశలో 290 కిలోమీటర్ల దూరంలో.. జఖౌ పోర్ట్​కు దక్షిణ-ఈశాన్యంగా 360 కిలోమీటర్ల దూరంలో బిపోర్‌జాయ్‌ కేంద్రీకృతమైందని భారత వాతవరణ శాఖ ప్రకటించింది. జూన్ 15న ఇది కచ్ తీరాన్ని తాకే అవకాశముందని పేర్కొంది. ఆ సమయంలో 150 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని ఐఎం​డీ వెల్లడించింది.

Biporjoy live news : బిపోర్​జాయ్​ తీరంవైపు ముంచుకొస్తున్న నేపథ్యంలో మొత్తం రెండు దఫాలుగా తీర ప్రాంత ప్రజల తరలింపు పక్రియ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. సముద్రానికి 0-5 కిలోమీటర్ల దగ్గర్లో ఉన్న వారిని మొదటగా సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వారు వివరించారు. ఆ తరువాత 5-10 కిలోమీటర్ల పరిధిలో ఉండే వారిని తరలించినట్లు పేర్కొన్నారు. తరలింపు ప్రక్రియలో చిన్నపిల్లలకు, వృద్ధులకు, గర్భిణీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు అధికారులు వివరించారు. ఇప్పటి వరకు 7500 మందికిపైగా సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వారు తెలిపారు.

ప్రస్తుతం 12 ఎన్‌డీఆర్‌ఎఫ్‌, 12 ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి. మరో 15 బృందాలు స్టాండ్‌బైలో ఉన్నాయి. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సైన్యం, నౌకా, కోస్టుగార్డు దళాలతో అధికారులు సన్నద్ధంగా ఉన్నారు. భావ్‌నగర్, రాజ్‌కోట్, అహ్మదాబాద్, గాంధీధామ్​లో ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్​లతో పాటు హెల్ప్​లైన్ నంబర్లను కూడా అధికారులు ఏర్పాట్లు చేశారు. కాగా సౌరాష్ట్ర, కచ్‌ ప్రాంతాలలో భారీ వర్షాలు పడే అవకాశముందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. సోమవారం తీర ప్రాంతాల్లోని కొన్ని జిల్లాల్లో ఇప్పటికే స్వల్పంగా వర్షం కురిసింది. బిపోర్​జాయ్​ ముంచుకొస్తున్న తరుణంలో కచ్‌ జిల్లాలో 144 సెక్షన్‌ను విధించారు అధికారులు. విద్యాసంస్థలకు జూన్​ 15 వరకు సెలవులు ప్రకటించారు.

పలువురు మృతి..
అటు బిపోర్‌జాయ్‌ తుపాను ప్రభావంతో ముంబయిలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎం​డీ వెల్లడించింది. దీంతో అధికారులు అప్రమత్తమై.. సముద్ర తీరం వెంబడి గస్తీ చేపట్టారు. అయితే, అధికారుల హెచ్చరికలు ఏ మాత్రం పట్టించుకోని నలుగురు యువకులు.. జుహూ బీచ్‌ వద్ద సముద్రంలోకి వెళ్లారు. అనంతరం అలల ఉద్ధృతికి గల్లంతయ్యారు. సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. వారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టగా.. ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగతా ఇద్దరి కోసం కూడా గాలింపులు జరుగుతున్నాయి. అటు గుజరాత్‌లోనూ ముగ్గురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. తుపాను ప్రభావంతో బలమైన గాలులు వీస్తుండటం వల్ల ఇప్పటికే అనేక చెట్లు నేలకూలాయి. కాగా రాజ్‌కోట్‌లో బైక్‌పై దంపతులు వెళ్తుండగా.. ఓ చెట్టు కూలిన ఘటనలో భార్య మరణించింది. భర్తకు తీవ్ర గాయలయ్యాయి.

పలు రైళ్ల రద్దు..
బిపోర్​జాయ్​ తుపాన్​ నేపథ్యంలో గుజరాత్​లోని తీర ప్రాంతాలకు వెళ్లే 50కి పైగా రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసింది పశ్చిమ రైల్వే జోన్​. రాబోయే మూడు రోజుల్లో పరిస్థితిని బట్టి మిగతా రైళ్ల రద్దును కూడా పరిశీలిస్తున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది.

ప్రధాని సమీక్ష..
మరోవైపు, భారత ప్రధాని మోదీ అధ్యక్షతన దిల్లీలో సోమవారం అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. తుపానుపై అధికారుల సన్నద్ధతపై ప్రధాని సమీక్షించారు. ఈ సమీక్ష సమావేశానికి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతోపాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. కేంద్ర హోంశాఖ 24 గంటలూ తుపాను పరిస్థితిని సమీక్షిస్తోందని ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది.

Last Updated : Jun 13, 2023, 11:37 AM IST

ABOUT THE AUTHOR

...view details