తెలంగాణ

telangana

అల్లకల్లోలం సృష్టించిన బిపోర్​జాయ్​.. విద్యుత్​ స్తంభాలు నేలమట్టం.. వేల గ్రామాలకు కరెంట్ కట్

Cyclone Biporjoy Gujarat : తీరం దాటిన తర్వాత బిపోర్​జాయ్​ తుపాను అల్లకల్లోలం సృష్టించింది. వేలాది విద్యుత్​ స్తంభాలు పడిపోగా.. వందలాది చెట్లు నేలకొరిగాయి. దాదాపు వెయ్యి గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భారీ వర్షాల కారణంగా వరదలు ముంచెత్తగా.. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తుపాను కారణంగా ఇద్దరు మరణించగా.. 23 మంది గాయపడ్డారు. కచ్​, మాండ్వి తదితర దక్షిణ గుజరాత్​ ప్రాంతాలతో పాటు రాజస్థాన్​లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం, శనివారం కూడా​ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఇరు రాష్ట్రాల అధికారులు విపత్తు నిర్వహణ అధికారులు అప్రమత్తమయ్యారు.

By

Published : Jun 16, 2023, 5:05 PM IST

Published : Jun 16, 2023, 5:05 PM IST

Cyclone Biporjoy Latest Status
Cyclone Biporjoy Latest Status

Biporjoy Cyclone Current Status : బిపోర్‌జాయ్‌ తుపాను తీరం దాటిన తర్వాతబీభత్సం సృష్టించింది. 140 కి.మీల వేగంతో బలమైన ఈదురుగాలులు వీయడం వల్ల పలు ప్రాంతాల్లో వందలాది చెట్లు నేలకూలాయి. 5,120 విద్యుత్​ స్తంభాలు కూలిపోయి 4,600 గ్రామాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఈ గ్రామాల్లో 3,580 గ్రామాలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించామని అధికారులు తెలిపారు. ఇంకా దాదాపు మరో 1,000 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని చెప్పారు.

బిపోర్​జాయ్​ తుపాను బీభత్సం

Cyclone Biporjoy Latest Status : ఆకస్మిక వరదలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తుపాను ధాటికి గుజరాత్​లోని కచ్​, సౌరాష్ట్ర ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. వేలాది చెట్లు నేలకూలడం వల్ల హైవేలపై ట్రాఫిక్ సమస్య ఏర్పడిందని అధికారులు తెలిపారు. 474 ఇళ్లు దెబ్బతిన్నాయని వెల్లడించారు. ద్వారకలో చెట్లు, హోర్డింగులు నేలకూలాయని చెప్పారు.

సహాయక కార్యక్రమాల్లో ఎన్డీఆర్​ఎఫ్​ బృందం

'ముంద్ర, మాండ్వి, నలియా, జఖౌ ప్రాంతాల్లో బలమైన ఈదురు గాలులతో భారీ వర్షాలు పడుతున్నాయి. ఎక్కడికక్కడ అధికారులు మోహరించి జిల్లా అంతటా బందోబస్తు ఏర్పాటు చేశాము. తుపాను పూర్తిగా తగ్గిన తర్వాతే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం' అని భుజ్​ ఎస్పీ కరణ్​ సింగ్​ వాఘేలా అన్నారు.

Biporjoy Cyclone Landfall Time : గురువారం అర్ధరాత్రి తర్వాత గుజరాత్‌లోని కచ్‌ ప్రాంతంలో తీరం దాటింది. తీరాన్ని దాటే ప్రక్రియ శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటల వరకు కొనసాగిందని అధికారులు తెలిపారు.
బిపోర్​జాయ్​ తుపాను బీభత్సం

తుపాను బలహీనం.. కచ్​లో భారీ వర్షాలు..
Biporjoy Cyclone Affected Creas : తుపాను బలహీన పడిందని.. దాని కారణంగా కచ్​లో భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ద్వారక, జామ్​నగర్​, మోర్బి ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. పోర్​బందర్​, రాజ్​కోట్​లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. శనివారం కూడా కచ్​, పటాన్, మేహ్​సన, బనస్​కంత ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది.

కూలిపోయిన చెట్లను తొలగిస్తున్న సిబ్బంది

Biporjoy Cyclone Affected Cities : మరోవైపు.. భారీ వర్షాల కారణంగా కచ్​లోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. మాండ్విలోని పలు ప్రాంతాల్లో నివాస సముదాయాలు, ఆసుపత్రుల్లోకి వరదనీరు చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నలియా ప్రాంతంలో విద్యుత్ తెగిపోవడం వల్ల 45 గ్రామాలకు కరెంట్​ సరఫరా నిలిచిపోయింది. భావ్‌నగర్‌లో వరదనీటిలో చిక్కుకున్న మేకలను కాపాడేందుకు వెళ్లిన తండ్రీకొడుకులు గురువారం ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రవ్యాప్తంగా 23 మంది గాయపడ్డారు. 24 పశువులు మృతిచెందాయి.

'చాలా చోట్ల బలమైన ఈదురు గాలులు వీయడం వల్ల ముందుజాగ్రత్త చర్యగా విద్యుత్‌ను నిలిపివేశారు. తుపాను ధాటికి విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. అనేక చెట్లు నేలకూలాయి. దీని కారణంగా ఆస్తి నష్టం జరిగింది. ఎంతమేర నష్టం జరిగిందనే దానిపై సర్వే జరుగుతోంది. సర్వే పూర్తైన తర్వాత సరైన లెక్కలు వస్తాయి. వీలైనంత త్వరగా పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడానికి ప్రయత్నిస్తాము. చెట్ల తొలగింపు పనులు జరుగుతున్న 2 రహదారులు మూసివేశాం' అని కచ్​ కలెక్టర్​ అమిత్ అరోరా చెప్పారు.

రాజస్థాన్​లోనూ బిపోర్​జాయ్​ ప్రభావం..
Cyclone Biporjoy Rajasthan : తుపాను బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారడం వల్ల.. శుక్రవారం సాయంత్రానికి రాజస్థాన్‌లోనూ తుపాను ప్రభావం కనిపించనుందని ఐఎండీ అంచనా వేసింది. దీంతో జాలోర్​, బాఢ్​మేర్​ జిల్లాకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. రాజస్థాన్​ ప్రభుత్వం అభ్యర్థన మేరకు జాలోర్​కు ఒక ఎన్డీఆర్​ఎఫ్ బృందాన్ని పంపించామని ఎన్డీఆర్​ఎఫ్​ డీజీ అతుల్​ కర్వాల్​ తెలిపారు. ​అది కాకుండా కర్ణాటకలో 4 బృందాలు, మహారాష్ట్రలో 5 బృందాలు మోహరించామని చెప్పారు. జోధ్​పుర్​, జైసల్మేర్​​, పాలీ, సిరోధి ప్రాంతాల్లో కూడా అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని.. రాజ్​సమద్​, దుంగాపుర్​ పరిసర ప్రాంతాల్లో శుక్రవారం, శనివారం భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రభావిత జిల్లాల్లోని స్థానిక యంత్రాంగం కూడా అప్రమత్తమై.. పౌర రక్షణ, విపత్తు నిర్వహణ ఏర్పాట్లు చేస్తుంది.

సీఎం సమీక్ష..
గుజరాత్​ రాజధాని గాంధీనగర్‌లోని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్‌లో బిపోర్​జాయ్​ తుపాను ప్రభావాన్ని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సమీక్షించారు. వరద పరిస్థితుల దృష్ట్యా ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో ఫోన్లో మాట్లాడారు. తుపాను పరిస్థితుల గురించి ప్రధాని మోదీ.. భూపేంద్ర పటేల్​ను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలకు కేంద్రం అన్నివిధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details