Biparjoy Cyclone Gujarat: అతి తీవ్రమైన తుపానుగా పేర్కొంటున్న 'బిపోర్జాయ్' భారీ స్థాయిలో నష్టం కలిగించే ప్రమాదం ఉందని.. ముఖ్యంగా గుజరాత్‌లోని కచ్, జామ్‌నగర్, దేవభూమి ద్వారక తదితర ప్రాంతాలపై దీని ప్రభావం అధికంగా ఉండనుందని భారత వాతావరణ శాఖ(ఐఎమ్‌డీ) హెచ్చరించింది. ఈ నెల 15న సాయంత్రం సమయంలో గంటకు 125-135 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో జఖౌ పోర్ట్ సమీపంలో సౌరాష్ట్ర సహా కచ్ తీరాలను దాటుతుందని అంచనా వేసింది. ఈ తుపాను ధాటికి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఐఎమ్‌డీ అధికారి మృత్యుంజయ్ మోహపాత్ర తెలిపారు.
"అలలు ఆరు మీటర్ల ఎత్తుకు ఎగిసి సౌరాష్ట్ర, కచ్‌లోని లోతట్టు తీర ప్రాంతాలను ముంచెత్తుతాయి. దీంతో తక్షణమే సహాయక చర్యలను ప్రారంభించాలని అధికారులకు సూచించాము. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి."
- మృత్యుంజయ్ మోహపాత్ర, ఐఎమ్‌డీ చీఫ్
సర్కార్ అలర్ట్..
తుపాను తీరం దాటే రోజున కచ్, దేవభూమి ద్వారక సహా జామ్‌నగర్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 20 సెం.మీల కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అయ్యే సూచనలున్నాయని ఐఎమ్‌డీ తెలిపింది. అలాగే పోర్‌బందర్, రాజ్‌కోట్, మోర్బీతో పాటు నాఘర్ ప్రదేశాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని చెప్పింది. ఈ జిల్లాల్లో 145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఐఎమ్‌డీ హెచ్చరికల నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం అప్రమత్తమైంది. బిపోర్జాయ్ ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉన్న జిల్లాల్లో ఇప్పటికే సహాయక చర్యలు మొదలుపెట్టారు అధికారులు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. జునాగఢ్, కచ్, జామ్‌నగర్, పోర్‌బందర్, ద్వారక, గిర్-సోమ్‌నాథ్, మొర్బీ, రాజ్‌కోట్ జిల్లాల నుంచి ఇప్పటివరకు 20వేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు గుజరాత్ ప్రభుత్వం తెలిపింది. గుజరాత్‌లో దక్షిణ, ఉత్తర తీరాల్లో మత్స్య సంబంధిత కార్యకలాపాలను నిలిపివేశారు. తుపాను పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా సమీక్ష నిర్వహించారు. తాజా పరిస్థితి, ముందస్తు సహాయక చర్యల ఏర్పాట్ల వివరాలను అధికారులతో అడిగి తెలుసుకున్నారు.
బిపోర్జాయ్ తుపాను- ఎగిసిపడుతున్న అలలు 8వేల కోట్ల విపత్తు నిర్వహణ పథకాలు!
'బిపోర్జాయ్' తుపాను నష్టనివారణ చర్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌తో కలిసి మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. తుఫాన్ కారణంగా ప్రభావితం అయ్యే ఎనిమిది జిల్లాల ఎంపీలు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.
మరోవైపు మంగళవారం దిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల విపత్తు నిర్వహణ విభాగాల అధికారులతో హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తుపాను సృష్టించే నష్టాలను నివారించేందుకు ముందు జాగ్రత్త చర్యగా 8 వేల కోట్ల రూపాయలతో విపత్తు నిర్వహణ పథకాలను ప్రకటించారు షా.
బిపోర్జాయ్ తుపాను- ఎగిసిపడుతున్న అలలు రాష్ట్రాల్లో అగ్నిమాపక సేవలను విస్తరించడం సహా ఆధునీకరించడం కోసం మొత్తం రూ.5000 కోట్లు; పట్టణాల్లో వరదల ప్రమాదాన్ని తగ్గించేందుకు.. ముఖ్యంగా అత్యధిక జనాభా కలిగిన ఏడు మెట్రో నగరాలైన ముంబయి, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, పుణె కోసం రూ.2500 కోట్లు; 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో కొండచరియలు విరిగిపడటం వంటి ఘటనలను తగ్గించడానికి రూ.825 కోట్లతో జాతీయ ల్యాండ్‌స్లైడ్ రిస్క్ మిటిగేషన్ స్కీమ్‌లను ప్రవేశపెట్టనున్నట్లు హోం మంత్రి తెలిపారు.