తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Cyclone Biparjoy : 38వేల మంది సురక్షిత ప్రాంతాలకు.. పరిస్థితిపై ముఖ్యమంత్రి సమీక్ష

Cyclone Biparjoy : బిపోర్​జాయ్​ తుపాను ధాటికి నష్టపోయే అవకాశం ఉన్న గుజరాత్​లోని తీర ప్రాంతాల్లో నివసించే దాదాపు 38 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది గుజరాత్​ ప్రభుత్వం. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా 17 NDRF, 12 SDRF బృందాలను తీర ప్రాంతాల్లో సిద్ధంగా ఉంచింది.

Gujarat Cyclone Biparjoy
బిపోర్​జాయ్​ భయం.. 38 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలింపు..

By

Published : Jun 14, 2023, 10:56 AM IST

Updated : Jun 14, 2023, 12:37 PM IST

Cyclone Biparjoy : అతి తీవ్ర తుపానుగా మారిన బిపోర్​జాయ్​ కచ్ తీరం వైపు దూసుకొస్తున్న నేపథ్యంలో గుజరాత్​ ప్రభుత్వం సహాయక చర్యలను వేగవంతం చేసింది. ఇప్పటివరకు రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో తీర ప్రాంతాల్లో నివసించే దాదాపు 37,794 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ముఖ్యంగా సముద్ర తీరానికి 10 కి.మీల లోపు నివసించే ప్రజలను ముందుగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు.

30 బృందాలు సిద్ధం..!
Cyclone Biparjoy Gujarat : తుపాను తీవ్రత దృష్ట్యా దేవభూమి ద్వారక, రాజ్‌కోట్‌, జామ్‌నగర్‌, జునాగఢ్‌, పోర్‌బందర్‌, గిర్‌ సోమనాథ్‌, మోర్బి, వల్సాద్‌ జిల్లాల్లో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం(ఎన్డీఆర్​ఎఫ్​) 18 బృందాలు, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్​డీఆర్​ఎఫ్​) 12 బృందాలను సిద్ధంగా ఉంచామని గుజరాత్​ ప్రభుత్వం తెలిపింది. సున్నిత ప్రాంతాల్లో నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి తగిన ఏర్పాట్లు చేయాలని విద్యుత్, టెలికమ్యూనికేషన్, ఆరోగ్య శాఖలను ఆదేశించింది. తాగునీరు, పాలు, కూరగాయలు, ఆహారం వంటి నిత్యావసరాలను బాధితులకు అందించాలని మంగళవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్వహించిన వర్చువల్ సమావేశంలో గుజరాత్ ప్రభుత్వాన్ని కోరినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు నిర్వాసితులకు అవసరమైన సరుకులను అధికారులు పంపిణీ చేశారు.

73 గర్భిణీల తరలింపు.. 9 మంది డెలివరీ!
తుపాను సహాయక చర్యల్లో భాగంగా ఆరోగ్య శాఖ ఇప్పటివరకు 73 మంది గర్భిణీలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఇందులో 9 మంది గర్భిణీ స్త్రీలు ఆరోగ్య కేంద్రాల్లో పండంటి శిశువులకు జన్మనిచ్చారు. అంతేకాకుండా ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వృద్ధులు, పిల్లలను కూడా మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన దాదాపు 400కి పైగా పునరావాస కేంద్రాల్లో బాధితులు ఆశ్రయం పొందుతున్నారు. దాదాపు 70 వేల మందికిపైగా తీర ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాల్లో ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది గుజరాత్​ ప్రభుత్వం. ఆ దిశగా రెస్క్యూ ఆపరేషన్​ను కొనసాగిస్తోంది.

సీఎం సమీక్ష!
తుపాన్​ను ఎదుర్కొనే సన్నద్ధతపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ బుధవారం గాంధీనగర్‌లోని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్‌లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంగళవారం రాత్రి కూడా ప్రభుత్వ అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం కొనసాగుతున్న సహాయక చర్యలపై సమీక్షించారు. అనంతరం అనుసరించాల్సిన వ్యూహాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Biparjoy Cyclone News : గుజరాత్​లోని జఖౌ పోర్టు సమీపంలో ఈ నెల 15వ తేదీన తీరం దాటనున్న బిపోర్​జాయ్​ తుపాను భారీ నష్టం కలిగించే అవకాశముందని అధికారులు తెలిపారు. అరేబియా సముద్రం మీదుగా బిపోర్​జాయ్​ తుపాను ఉత్తర వాయువ్య దిశగా కదిలి జఖౌ నౌకాశ్రయానికి దాదాపు 280 కి.మీ దూరంలో 14 జూన్ 2.30 గంటలకు తీరాన్ని తాకునుందని ఐఎమ్​డీ వివరించింది. జూన్ 15 సాయంత్రంలోగా ఈ తుపాను జఖౌ పోర్ట్​ను దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా, ఈ తీవ్ర తుపాను కారణంగా కచ్​, దేవభూమి ద్వారక, జాంనగర్​ జిల్లాలు తీవ్రంగా ప్రభావితం కానున్నాయని ఇప్పటికే ఐఎమ్​డీ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే తీర ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్​ను జారీ చేసింది.

మంగళవారం బిపోర్​జాయ్​ సౌరాష్ట్ర, కచ్​లను దాటి గుజరాత్​లోని మాండవి, పాకిస్థాన్​లోని కరాచీల మధ్య జఖౌవద్ద గురువారం సాయంత్రం తీరం దాటనుంది. ఆ సమయంలో 125 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణశాఖ డైరెక్టర్​ జనరల్​ మృత్యుంజయ్​ మహాపాత్ర వెల్లడించారు. పోర్​బందర్​, దేవభూమి ద్వారక జిల్లాలు సహా మరికొన్ని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో బలమైన గాలులతో 25 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైన ఆశ్చర్యం లేదని ఆయన వివరించారు. క్రమంగా ఈ తుపాను గుజరాత్​లో బలహీనపడి ఈశాన్య దిశగా దక్షిణ రాజస్థాన్‌ వైపు కదులుతుందని ఐఎమ్​డీ అంచనా వేసింది. కాగా, జూన్ 15-17 మధ్య ఉత్తర గుజరాత్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో జూన్ 16 వరకు సముద్రంలో చేపలను పట్టే మత్స్యకారులను అనుమంతించట్లేదు అధికారులు. అలలు భారీగా ఎగిసిపడుతున్నందున ఓడరేవులను కూడా మూసేశారు.

బిపోర్​జాయ్​పై ప్రధాని, కేంద్ర, రాష్ట్ర మంత్రుల ఫోకస్​!
బిపోర్​జాయ్​ తుపాను నష్టనివారణ చర్యలపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్​ షా దేశ రాజధాని దిల్లీలో సమీక్షా సమావేశం నిర్వహించారు. సాధ్యమైనంత వరకు తుపాను కారణంగా జరిగే నష్టాన్ని తగ్గించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ కంట్రోల్ రూం ద్వారా 24 గంటలూ పరిస్థితిని హోం మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తుందని.. గుజరాత్ ప్రభుత్వానికి కేంద్రం అన్ని విధాలుగా సహాయం అందిస్తుందని షా హామీ ఇచ్చారు. సోమనాథ్, ద్వారకలో భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయాల పరిసరాల చుట్టూ అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని హోంమంత్రి సూచించారు. మరోవైపు తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే ఎనిమిది జిల్లాల ఎంపీలు కూడా వివిధ స్థాయుల్లో అధికారులు, సీఎంతో చర్చించారు. ఇదిలా ఉంటే బిపోర్​జాయ్​ తుపాను ప్రభావం ముంబయి తీర ప్రాంతాల్లో కూడా కనిపించిందని భారత వాతావరణ శాఖ తెలిపింది.

69 రైళ్లు రద్దు..
తుపాను నేపథ్యంలో 69 రైళ్లను రద్దు చేసినట్లు పశ్చిమ రైల్వే ప్రకటించింది. 58 రైళ్లను పాక్షికంగా రద్దు చేశామని వెల్లడించింది.

Last Updated : Jun 14, 2023, 12:37 PM IST

ABOUT THE AUTHOR

...view details