మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టి అధిక లాభాలు పొందొచ్చని ప్రజలను మోసం చేస్తున్న ఓ సైబర్ నేరస్థుడ్ని ఉత్తరాఖండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. దెహ్రాదూన్‌కు చెందిన ఓ మహిళకు నకిలీ వెబ్సైట్ ద్వారా డబ్బు ఎర చూసి కోటి రుపాయలు మేర మోసం చేసింది ఆ ముఠా. బాధితురాలి ఫిర్యాదు మేరకు స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆ ముఠా నాయకుడుని బెంగళూరులో అరెస్ట్ చేశారు.
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి అంటూ ఘరానా మోసం.. మహిళకు రూ.కోటి టోకరా.. నిందితుడు అరెస్ట్ - ఉత్తరాఖండ్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు
ఫేక్ వెబ్సైట్ సృష్టించి ఆన్లైన్ మోసానికి పాల్పడుతున్న ఓ సైబర్ ముఠా నాయకుడ్ని ఉత్తరాఖండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టి భారీగా పొందొచ్చని ఆశ చూపించి.. అకౌంట్‌ను ఖాళీ చేస్తున్న ఆ దుండగుడ్ని ఎస్టీఎఫ్ పోలీసులు కర్ణాటకలో అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కర్ణాటకకు చెందిన మహ్మద్ షరీఫ్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో ఓ సైబర్ ముఠా.. నకిలీ వెబ్సైట్ ద్వారా అమాయకపు ప్రజలకు డబ్బు ఎర చూపి కోట్లు సంపాదిస్తుంది. దీనికోసం వీరు రకరకాల పేర్లతో బ్యాంక్ అకౌంట్లు, ఫేక్ ఐడీలతో ఫోన్ నంబర్స్, వాట్సాప్ ఖాతాలు సృష్టించారు. వీటిద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టి.. అధిక మొత్తంలో డబ్బు సంపాదించొచ్చని అమాయక ప్రజలకు ఆశ కలిగించేది ఈ ముఠా. దీనిలో భాగంగా దెహ్రాదూన్‌కు చెందిన ఓ మహిళకు కొన్నిరోజులు క్రితం లిసా అనే పేరుతో.. మలేషియన్ నంబర్ నుంచి వాట్సాప్‌లో సందేశాలు పంపారు. ఈ మెస్సేజ్‌లలో తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి అధికంగా సంపాదించొచ్చని ఆమెకు ఆశ చూపారు. దీంతో వారి మాటలు నమ్మిన మహిళ.. వారు పంపిన వెబ్సైట్ ద్వారా పెట్టుబడి పెట్టింది. మొదట బాధితురాలికి కొద్ది మొత్తంలో లాభాలు వచ్చినట్లు చూపించారు. ఆ తర్వాత ఆమె అకౌంట్లో ఉన్న కోటి రుపాయలను కాజేశారు. దీంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితురాలు సైబర్ పోలీసుల్ని ఆశ్రయించింది.
రంగంలోకి దిగిన స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. నిందితులు ఉపయోగించిన ఫోన్ నంబర్, బ్యాంక్ అకౌంట్ ద్వారా ఉడిపికి చెందిన మహ్మద్ షరీఫ్‌గా గుర్తించారు. వెంటనే అక్కడకు చేరుకున్న టాస్క్‌ఫోర్స్ బృందం నిందితుడు మహ్మద్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడు నుంచి ఒక ల్యాప్‌టాప్, 3 మొబైల్ ఫోన్లు, 11 డెబిట్ కార్డులు, 3 క్రెడిట్ కార్డులు, వివిధ బ్యాంకులకు చెందిన పాస్ బుక్, చెక్ బుక్‌లు, ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, ట్రావెల్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. అయితే, నిందితుడు క్రిప్టోకరెన్సీ రూపంలో దాదాపు రూ.10 కోట్లను ఇతర దేశాలను పంపించినట్లు గుర్తించారు టాస్క్‌ఫోర్స్ సిబ్బంది. ప్రస్తుతం ఈ ముఠాతో సంబంధం ఉన్న మరికొందర్ని వెతికే పనిలో ఉన్నట్లు ఎస్టీఎఫ్ ఎస్ఎస్పీ ఆయుశ్ అగర్వాల్ వెల్లడించారు.