రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు, ప్రముఖుల పేర్లతో నకిలీ ఖాతాలు సృష్టించి సైబర్ మోసాలకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవల పెరిగిపోయాయి. ఝార్ఖండ్ డీజీపీ నీరజ్ సిన్హా పేరిట సైబర్ నేరగాళ్లు ఫేస్బుక్ నకిలీ ఖాతా తెరిచారు. పలువురికి ఫ్రెండ్ రిక్వస్టులు సైతం పంపారు. ఝార్ఖండ్ పోలీసు బాస్ పేరిటే డబ్బులు వసూలు చేసేందుకు యత్నించారు. ఈ విషయం తెలుసుకున్న డీజీ.. తన పేరిట వస్తున్న రిక్వెస్టులు ఆమోదించకూడదని కోరారు.
పట్టుబడిన దాఖలాలు లేవు..!
సైబర్ కేటుగాళ్లు ఇప్పటికే చాలా మంది ఐపీఎస్లు, పోలీసు అధికారుల పేర్లతో నకిలీ ఖాతాలు తెరిచి మోసాలకు పాల్పడిన ఉదంతాలు ఉన్నాయి. అందులో కొల్హాన్ డీఐజీ రాజీవ్ రంజన్ సింగ్, రాంచీ డీసీ చిత్ర రంజన్, బొకారో ఎస్పీ చందన్ ఝా, సీఐడీ ఏడీజీ ఇంఛార్జ్ అమరేంద్ర కుమార్ వర్మ, విశ్రాంత డీజీపీ బిభూతి ప్రధాన్, రిటైర్డ్ డీఎస్పీ అరవింద్ కుమార్ సిన్హా వంటి ప్రముఖులు ఉన్నారు. అయినప్పటికీ.. ఇంత వరకు ఒక్క కేసులోనూ నేరగాళ్లను పట్టుకున్న దాఖలాలు లేవు.