Cyber Attacks: ప్రపంచవ్యాప్తంగా అనేక సైబర్ ముఠాలు మన దేశానికి చెందిన వెబ్‌సైట్లను హ్యాక్ చేస్తున్నాయి. గడచిన ఆరు రోజుల్లో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు చెందిన 1,400 వరకూ వెబ్‌సైట్లు హ్యాకింగ్‌కు గురయ్యాయి. భాజపా మాజీ జాతీయ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా సైబర్ ముఠాలు ఈ చర్యకు పాల్పడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాల వెబ్‌సైట్లనూ హ్యాక్ చేస్తుండటంతో తాజాగా అన్ని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు చెందిన వెబ్‌సైట్లను హ్యాక్ చేయడం కొత్త కాదు. ఇప్పుడు మన దేశానికి చెందిన వెబ్‌సైట్లపై మూకుమ్మడి దాడికి పాల్పడుతుండటం కలవరపాటుకు గురిచేస్తోంది.
13 వేల మంది సభ్యులు ఉన్న డ్రాగన్‌ఫోర్స్ మలేసియా అనే ముఠా భారత ప్రభుత్వంపై డిజిటల్ యుద్ధం ప్రకటించింది. సామాజిక మాధ్యమం 'టెలిగ్రామ్'లో ప్రత్యేక గ్రూప్ ఏర్పాటు చేసి.. కొత్తగా సభ్యులను చేర్చుకుంటూ 'హ్యాక్టివిజం' పేరుతో దేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తోంది. దీని ప్రోద్బలంతో '1877' అనే ముఠా కూడా మన దేశానికి చెందిన వెబ్‌సైట్లను హ్యాక్ చేస్తోంది. ఒక అంచనా ప్రకారం రోజుకు సుమారు 200 వెబ్‌సైట్లు ఈ సైబర్ ముఠాల బారిన పడుతున్నాయి. వీటిలో రాష్ట్ర ప్రభుత్వాలకు చెందినవీ ఉండటం గమనార్హం. ఆర్థిక లావాదేవీలు నిర్వహించే ప్రముఖ పేమెంట్ గేట్‌వే గురువారం హ్యాకింగ్‌కు గురైంది. ఆ సంస్థకు అనుబంధంగా ఉన్న అనేక ఈ కామర్స్ సంస్థల చెల్లింపులు నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వ్యవసాయ శాఖకు చెందిన వివిధ సైట్లపై 'డిస్ట్రిబ్యూటెడ్ డినైల్ ఆఫ్ సర్వీస్(డీడీఓఎస్)'తో దాడి చేయడంతో అవి నిలిచిపోయాయి. ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయం వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసిన నేరగాళ్లు వందల సంఖ్యలో పాస్‌పోర్ట్‌ల వివరాలు చోరీ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆ సైట్‌ను వెంటనే పునరుద్ధరించారు.