కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం (Congress CWC Meeting) త్వరలోనే జరగనుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా తెలిపారు. పంజాబ్ కాంగ్రెస్‌లో సంక్షోభం నేపథ్యంలో సీడబ్ల్యూసీ భేటీ ఏర్పాటు చేయాలని పలువురు సీనియర్ నేతలు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో మాట్లాడిన సుర్జేవాలా.. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandhi CWC Meeting) ఈ మేరకు సంకేతాలు ఇచ్చినట్లు తెలిపారు. శిమ్లాకు బయల్దేరే ముందే సోనియా సీడబ్ల్యూసీ భేటీపై సంకేతాలు ఇచ్చారని.. ఆ ప్రకారం త్వరలోనే భేటీ జరుగుతుందని అన్నారు.
పంజాబ్ సంక్షోభం నేపథ్యంలో పార్టీలో సంస్కరణలపై అసంతృప్త సీనియర్ నేతలు అధిష్ఠానంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. సీడబ్ల్యూసీ భేటీ నిర్వహించి చర్చించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై సీనియర్ నేత కపిల్ సిబల్ ఇప్పటికే మాట్లాడారు. గతేడాది ఆగస్టులో కాంగ్రెస్ నాయకత్వానికి లేఖ రాసిన నేతలు (G23 Congress) ఇప్పటికీ చర్యల కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. అధ్యక్ష పదవితో పాటు సీడబ్ల్యూసీ, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఎన్నికలపై అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై ఆలోచిస్తున్నట్లు చెప్పారు.