CWC Meeting Today :త్వరలో జరగనున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు సమన్వయం, క్రమశిక్షణ, ఐక్యతతో పని చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే.. పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సమాజంలోని బలహీనవర్గాల స్థితిగతులపై సామాజిక-ఆర్థిక వివరాలను పార్టీ నాయకులు కలిగి ఉండాలని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు సామాజిక న్యాయం, హక్కులు కల్పించేందుకు దేశవ్యాప్తంగా కుల గణన నిర్వహించాలన్న డిమాండ్‌ను మరోసారి లేవనెత్తారు.
CWC Meeting Congress : దిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ మాజీ చీఫ్‌లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, పార్టీకి చెందిన ముఖ్యమంత్రులు, ఇతర నాయకులు పాల్గొన్నారు. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మిజోరం అసెంబ్లీ ఎన్నికల కోసం సమర్థమైన వ్యూహం అవసరమని ఖర్గే తెలిపారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో కాంగ్రెస్ విజయాలు పార్టీ కేడర్‌లో కొత్త ఉత్సాహం తెచ్చినట్లు చెప్పారు.
అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. పార్టీ నాయకులు సునిశిత సమన్వయం, క్రమశిక్షణ, ఐక్యతతో పనిచేయడం ముఖ్యమని ఖర్గే తెలిపారు. విపక్ష కూటమి 'ఇండియా' సమావేశాల ప్రభావం ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రసంగాల్లో స్పష్టంగా కనిపిస్తోందని ఖర్గే వ్యాఖ్యానించారు. 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఓబీసీ మహిళలకు రాజకీయ భాగస్వామ్యాన్ని కల్పిస్తూనే మహిళా రిజర్వేషన్లను అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అధికార బీజేపీ తప్పుడు ప్రచారాలను పటిష్ఠంగా ఎదుర్కోవాలని అన్నారు.
రాహుల్ నిర్ణయం.. పార్టీ నాయకత్వం ఆమోదం..
భారత్ జోడో యాత్రలో కలిసిన వెనుకబడిన తరగతుల ప్రజల ద్వారా కులగణన డిమాండ్‌ను ముందుకు తీసుకెళ్లాలని రాహుల్ గాంధీ ప్రతిపాదించారని కాంగ్రెస్ తెలిపింది. అందుకు పార్టీ నాయకత్వం ఆమోదం తెలిపిందని చెప్పింది. భారత్ జోడో యాత్ర సందర్భంగా దేశంలో కుల గణన జరగాలని దాదాపు ప్రతి రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల ప్రజలందరూ కోరారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్.. ట్వీట్ చేశారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా రాహుల్ వ్యవహరించారని.. కాంగ్రెస్ అధిష్ఠానం దానిని ఆమోదించిందని రమేశ్ తెలిపారు. సీడబ్ల్యూసీ సమావేశానికి ముందు ఎక్స్‌లో ఆయన పోస్ట్ చేశారు.
దేశంలో కులగణన కోసం కాంగ్రెస్ కొద్దిరోజులుగా పట్టుబడుతోంది. బిహార్‌లో కులగణన ఫలితాలను విడుదల చేసిన తర్వాత.. రాజస్థాన్ కూడా కులగణన సర్వే చేపట్టేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఛత్తీస్‌గఢ్‌లోనూ మళ్లీ అధికారంలోకి వస్తే కులాల సర్వే నిర్వహిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. మధ్యప్రదేశ్‌లో కూడా కులగణనను నిర్వహించడమే తమ ప్రధాన అజెండా అని చెప్పింది.