జాతీయ జెండా ముద్రించి ఉన్న కేకును కోసి తినడాన్ని నేరంగా పరిగణించలేమని మద్రాస్ హైకోర్టు సోమవారం పేర్కొంది. ఈ మేరకు జస్టిస్ ఎన్ ఆనంద్ నేతృత్వంలోని ధర్మాసనం ఓ కేసులో తీర్పునిచ్చింది.
ఏం జరిగింది?
2013, డిసెంబర్ 25న కోయంబత్తూర్లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో భాగంగా 6 అడుగుల పొడవుతో, 5 అడుగుల వెడల్పుతో ఓ కేకును తయారు చేశారు. దానిపై అశోక చక్రంతో ఉన్న త్రివర్ణ పతాకాన్ని ముద్రించారు. ఆ కేకును కార్యక్రమానికి హాజరైన వారందరికీ పంచిపెట్టారు. ఈ వేడుకల్లో 1,000 మంది పిల్లలు సహా 2,500 మంది పాల్గొన్నారు. డీసీపీ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ నేపథ్యంలో జాతీయ పతాకాన్ని అవమానపరిచారని పేర్కొంటూ హిందూ పబ్లిక్ పార్టీకి చెందిన డి.సెంథిల్ కుమార్.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. పోలీసులు ఆ ఫిర్యాదు స్వీకరించలేదు. 2017 ఫిబ్రవరిలో స్థానిక మేజిస్ట్రేట్ వద్ద దీనిపై ఫిర్యాదు చేశారు. దీన్ని సవాలు చేస్తూ ఓ స్థానిక పోలీస్ అధికారి హైకోర్టును ఆశ్రయించారు.