'హలో.. మీరు మా లక్కీ డ్రాలో విజేతగా నిలిచారు. మేము చెప్పిన కొంత మొత్తం కడితే చాలు విలువైన బహుమతులు మీ సొంతం' అంటూ ఆన్లైన్ మోసగాళ్లు ప్రజలకు టోకరా వేస్తుంటారు. ఈ మోసాలపై అధికారులు హెచ్చరిస్తున్నా ఇటువంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈసారి కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా ముగులవళ్లి గ్రామస్థులు మోసగాళ్ల వలలో చిక్కుకున్నారు.
గాయత్రి అనే మహిళకు కొద్ది రోజుల క్రితం గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేశారు. రూ.1500 చెల్లిస్తే.. రూ.15వేలు విలువ చేసే స్మార్ట్ఫోన్ ఇస్తామంటూ ఆశ చూపారు. ఈ ఆఫర్ మీకు వద్దంటే ఆ బహుమతి మరొకరికి అందిస్తామని చెప్పుకొచ్చారు. నిజమని నమ్మిన ఆ మహిళ వారు చెప్పిన మొత్తం చెల్లించింది. ఇంటి చిరునామా, ఇతర వివరాలు ఇచ్చింది. ఆ గ్రామంలోని మరో ఐదారుగురిదీ ఇదే కథ. వారు కూడా వచ్చిన ఆఫర్ వదులుకోవద్దని భావించి మోసగాళ్లకు డబ్బు సమర్పించుకున్నారు.