ఓ విలాసవంతమైన హోటల్లో నెలల తరబడి నివసించి.. రూ.25లక్షలు చెల్లించకుండా తప్పించుకున్నాడో వ్యక్తి. ఈ ఘటన నవీ ముంబయిలో జరిగింది. ఖారఘర్ ప్రాంతంలో ఉండే ఓ మూడు నక్షత్రాల హోటల్లోకి నవంబర్ 2020 నవంబర్ 24న బస చేయడానికి దిగాడు మురళీ మురుగేశ్ కామత్. ఆయన వెంట 12 ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు. తనిశ్ కామత్ అనే బాలున్ని తన కుమారునిగా పరిచయం చేశాడు. సినిమా ఇండస్ట్రీలో వీఎఫ్ఎక్స్ యానిమేటర్లా పనిచేస్తానని చెప్పాడు. తనకో రెండు రూములు కావాలని కోరాడు.
ఇదిగో.. అదిగో అంటూనే..
డబ్బులు నెల తర్వాత ఇస్తానని చెప్పి హోటల్ యజమాని సంతోష్ శెట్టితో మీటింగ్ జరిపిన తర్వాత రెండు డీలక్స్ రూములను బుక్ చేసుకున్నాడు మురుగేశ్ కామత్. అందుకు బదులుగా తన పాస్‌పోర్ట్‌ను కూడా హోటల్ యాజమాన్యం దగ్గర పెట్టాడు. ఓ రూములో నివాసం, మరో రూమ్‌లో ఇతరులతో తరచు సమావేశాలు ఏర్పాటు చేసేవాడు. మీటింగ్‌ల కోసం ఇతర వ్యక్తులు వచ్చి వెళ్తుండేవారు. మురుగేశ్ కామత్ వ్యవహారం చూసి, హోటల్ యాజమాన్యం కూడా నమ్మేసింది. నెల తర్వాత డబ్బులు అడగ్గా.. వివిధ కారణాలు చెబుతూ దాటవేయడం ఆరంభించాడు. ఓ రోజు గట్టిగా అడగ్గా.. పేరు లేని రెండు బ్లాంక్ చెక్‌లను ఇచ్చాడు. బ్యాంక్‌లో హోటల్ సిబ్బంది ఆ చెక్‌లను డిపాజిట్ చేయగా.. డబ్బులు లేవు. దీంతో మురుగేశ్‌ను నిలదీసినా.. ఇదిగో.. అదిగో.. అంటూ.. జులై వరకు గడుపుతూ వచ్చాడు.