కరోనా మహమ్మారి విలయతాండవం సాగిస్తున్న వేళ దేశ రాజధాని దిల్లీలో లాక్‌డౌన్ విధించారు. ఇవాళ రాత్రి 10గంటల నుంచి వచ్చే సోమవారం(ఏప్రిల్ 26) ఉదయం 5 గంటల వరకూ ఆరు రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు దిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. దిల్లీలో పరిస్థితిపై లెఫ్టినెంట్ గవర్నర్‌తో చర్చలు జరిపిన అనంతరం సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ మేరకు ప్రకటించారు.
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా లాక్‌డౌన్ తప్పనిసరన్న కేజ్రీవాల్.. ఆంక్షలను కఠినంగా పాటించాలని ప్రజలను కోరారు. ప్రస్తుత కష్టకాలాన్ని దిల్లీలోని 2 కోట్ల మంది సమష్టిగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.
"దిల్లీలో కొన్ని రోజుల పాటు లాక్‌డౌన్ విధించాల్సిన అవసరముంది. ఈరోజు రాత్రి 10 గంటల నుంచి వచ్చే సోమవారం ఉదయం 5 గంటల వరకు ఆరు రోజుల పాటు దిల్లీలో లాక్‌డౌన్ విధిస్తున్నాం. ఈ సమయంలో అత్యవసర సేవలు కొనసాగుతాయి. ఆహార పదార్థాలు, వైద్య సేవలు నడుస్తాయి. ఇది వివాహాల సీజన్. ప్రజలంతా ఎంతో ఆనందంతో పెళ్లిళ్లు జరుపుకుంటారు. వారి సంతోషాన్ని మేము దూరం చేయం. కేవలం 50 మంది అతిథులతో వివాహాలు జరుపుకోవాలి. అందుకు ప్రత్యేకంగా పాసులు జారీ చేస్తాం."
-అరవింద్ కేజ్రీవాల్. దిల్లీ ముఖ్యమంత్రి
ప్రమాదంలో ప్రజారోగ్య వ్యవస్థ..
ఆరోగ్య వ్యవస్థ పరిమితికి మించి కేసులు నమోదవుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్ నిర్ణయం తీసుకున్నట్లు కేజ్రీవాల్ వెల్లడించారు. కరోనా పాజిటివిటీ రేటు, ఇన్ఫెక్షన్లు భారీగా పెరుగుతున్నాయని, ఆస్పత్రుల్లో పడకల కొరత ఏర్పడిందని వివరించారు. ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య ఈ స్థాయిలో పెరిగితే.. ప్రజారోగ్య వ్యవస్థ ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని.. లాక్‌డౌన్ నిర్ణయం తీసుకున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు. ఈ ఆరు రోజుల్లో ఆస్పత్రుల్లో పడకలు, మందుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
స్వల్ప కాలికమే..
ఇది స్వల్ప కాలిక లాక్‌డౌన్ మాత్రమేనని వలస కూలీలు దిల్లీ వదిలి వెళ్లాల్సిన అవసరం లేదని విజ్ఞప్తి చేశారు. మరోవైపు లాక్‌డౌన్ ప్రకటనతో దిల్లీలో వైన్స్ షాపుల ముందు ప్రజలు బారులు తీరారు.
గోల్ మార్కెట్లో వైన్స్ ముందు వరుస భౌతిక దూరాన్ని తుంగలో తొక్కి మరీ మందుబాబులు మద్యం దుకాణాలకు పోటెత్తారు.
ఖాన్ మార్కెట్లో భారీ క్యూ మద్యం కొనుగోళ్లకు ఎగబడుతున్న జనం దిల్లీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఆదివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 25,462 కరోనా కేసులు వెలుగుచూశాయి. వైరస్‌తో 161 మంది ప్రాణాలు కోల్పోయారు. (పాజిటివిటి రేటు 29.74) శాతంగా ఉంది.
ఇదీ చూడండి:ఆ రాష్ట్రంలో మార్కెట్లు, కార్యాలయాలు బంద్