lift accident death in Tamil Nadu: లిఫ్ట్ ప్రమాదంలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని మృతిపై కేసు నమోదైన క్రమంలో అన్నాడీఎంకే నేత, తమిళనాడు మాజీ మంత్రి డీ జయకుమార్ కుమార్తె జయప్రియ అజ్ఞాతంలోకి వెళ్లారు. జయప్రియకు చెందిన ఫంక్షన్ హాల్లో రెండు రోజుల క్రితం లిఫ్ట్‌లో ఇరుకుని విద్యార్థిని మృతి చెందింది. దీంతో జయప్రియపై కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం నిందితురాలి కోసం గాలిస్తున్నామని, త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.
తిరువళ్లూర్ జిల్లాలోని గుమ్మిడిపూడిలో ఉన్న మ్యారేజ్ హాల్లో గత శుక్రవారం ఈ ప్రమాదం జరిగింది. మూడంతస్తుల భవనంలోని లిఫ్ట్ ప్రమాదంలో శీతల్ అనే విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. ఈ కేసులో హాల్ సూపర్వైజర్ తిరునవకరసు, లిఫ్ట్ ఆపరేషన్ ఇంఛార్జ్ ఎస్ కక్కన్, మేనేజర్ వెంకటేశన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. జయప్రియ పరారీలో ఉన్నారు.
"లిఫ్ట్‌ను నిబంధనలకు అనుగుణంగా నిర్మించలేదు. అది కేవలం ఆహారం తీసుకెళ్లేందుకేనని, మనుషులు వెళ్లేందుకు కాదని సూపర్వైజర్ తెలిపాడు. ఈ భవనం 2015లో నిర్మించారు. లిఫ్ట్‌ను దుంగలు, ప్లాస్టిక్ షీట్లతో తయారు చేశారు. 300 కిలోల వరకు మాత్రమే మోసుకెళ్లగలదు. శుక్రవారం బాధితురాలు శీతల్, మరో ఇద్దరు లిఫ్ట్‌లో ఎక్కి రెండో అంతస్తుకు వెళ్తుండగా లిఫ్ట్ గొలుసు తెగిపోయింది. బాలిక తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. "
- పోలీసులు.
అత్యాచారం కేసులో మంత్రి కుమారుడు:23 ఏళ్ల యువతిపై అత్యాచారం కేసులో రాజస్థాన్ మంత్రి మహేశ్ జోషి కుమారుడు రోహిత్ జోష్ని అరెస్ట్ చేసేందుకు జైపుర్ చేరుకున్నారు దిల్లీ పోలీసులు.' అత్యాచారం కేసులో పరారీలో ఉన్న నిందితుడు రోహిత్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసు బృందం జైపుర్ చేరుకుని తనిఖీలు చేపట్టింది.' అని ఉన్నతాధికారులు తెలిపారు.
జైపుర్‌కు చెందిన 23 ఏళ్ల యువతి తనపై రాజస్థాన్ పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ శాఖ మంత్రి మహేశ్ జోషి కుమారుడు రోహిత్ జోషి ఏడాదిగా పలు సందర్భాల్లో అత్యాచారానికి పాల్పడ్డాడని ఫిర్యాదు చేయగా తొలుత.. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు దిల్లీ పోలీసులు. సదర్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోనూ ఓసారి అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొనటం ద్వారా జీరో ఎఫ్ఐఆర్ను రెగ్యులర్ ఎఫ్ఐఆర్గా మార్చారు. దిల్లీ ఉత్తర జిల్లాలో మే 8న 376, 328, 312, 366, 377, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
'గత ఏడాది ఫేస్బుక్ ద్వారా రోహిత్ జోషి పరిచయమయ్యాడు. తొలిసారి జైపుర్‌లో కలిశాం. సవాయ్ మాధోపుర్కు రావాలని 2021, జనవరి 8న ఆహ్వానించాడు. తొలి మీటింగ్‌లోనే కూల్‌డ్రింగ్‌లో మత్తుపదార్థాలు కలిపి నగ్న చిత్రాలు తీశాడు. మరోసారి దిల్లీలో కలిసి ఓ హోటల్‌కు తీసుకెళ్లాడు. అక్కడ భార్యాభర్తలుగా రిజిస్టర్ చేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. మద్యం తాగి అత్యాచారానికి పాల్పడ్డాడు. వీడియో తీసి సోషల్ మీడియోలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. ఆ తర్వాత ఆగస్టులో గర్భం దాల్చినట్లు తెలిసింది. రోహిత్‌కు చెప్పగా గర్భనిరోధక మాత్రలు మింగిచాలని ప్రయత్నించాడు.' అని ఫిర్యాదులో పేర్కొంది బాధితురాలు.
ఇదీ చూడండి:బాలికపై తల్లి ప్రియుడు అత్యాచారం.. గర్భం దాల్చాక ఇంట్లోనే గుట్టుగా...