కర్ణాటక యాదగిరి జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. ఆడపిల్ల పుట్టిందన్న కోపంతో ఉన్న ఓ తండ్రి.. 9 నెలల చిన్నారిని అతి కిరాతకంగా చంపాడు. బడ్డేపల్లి గ్రామానికి చెందిన రాము, సావిత్రి అనే దంపతులకు 9 నెలల క్రితం ఆడపిల్ల జన్మించింది. ఆడపిల్ల పుట్టడం వల్ల రాము అప్పటి నుంచి ఆగ్రహంతో ఉన్నాడు. చిన్నారి జన్మించిన నాటి నుంచి కూలీ పనులకు సైతం వెళ్లకుండా కూతురిని కాపాడుకుంటోంది సావిత్రి. చిన్నారిని తాను చూసుకుంటానని నమ్మించిన రాము.. నవంబర్ 30న సావిత్రిని కూలీ పనులకు పంపాడు. సావిత్రి తిరిగి వచ్చేసరికి చిన్నారి గొంతు నులిని హత్య చేశాడు. సావిత్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు రామును అరెస్ట్ చేశారు. మద్యం మత్తులోనే రాము చిన్నారి గొంతు నులిమి హత్య చేశాడని ఎస్పీ వేదమూర్తి తెలిపారు.
ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపి తల్లి ఆత్మహత్య
కర్ణాటక మండ్యలో దారుణం జరిగింది. ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపింది ఓ తల్లి. అనంతరం ఆమె కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భార్యభర్తల మధ్య వివాదమే దీనికి కారణంగా తెలుస్తోంది.
మద్దుర్ పట్టణానికి చెందిన అఖిల్ కార్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. అతడి భార్య కౌజర్ ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లో పనిచేస్తోంది. వీరికి ఏడేళ్ల కుమారుడు హ్యరిస్, కూతుళ్లు అల్లిసా(4), అనమ్ ఫాతిమా(2) ఉన్నారు. గత ఏడాది కాలంగా భార్యభర్తల మధ్య గొడవలు జరగుతున్నాయి. దీంతో కలత చెందిన కౌజర్.. గురువారం రాత్రి పిల్లలకు విషమిచ్చి చంపింది. అనంతరం ఆమె కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.