తెలంగాణ

telangana

ETV Bharat / bharat

5వేల కిలోల బాంబులు గుర్తింపు.. వేల మంది సేఫ్.. CRPF శునకాలు భళా!

సీఆర్​పీఎఫ్​ శునకాలు ఇప్పటివరకు 5వేల కేజీల పేలుడు పదార్థాలను గుర్తించాయని, తద్వారా ఎంతో మంది జవాన్లను కాపాడాయని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా శునకాలకు ఏ విధంగా శిక్షణ అందిస్తారనే విషయాన్ని వివరించారు. పదవీ విరమణ తర్వాత వాటిని ఎలా చూసుకుంటారో తెలిపారు.

crpf-dogs-recover-5000-kgs-explosives
crpf-dogs-recover-5000-kgs-explosives

By

Published : Mar 26, 2023, 5:45 PM IST

కేంద్ర రిజర్వ్ పోలీస్ దళాల(సీఆర్​పీఎఫ్)కు చెందిన స్నిఫర్ డాగ్స్.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 5వేల కేజీల పేలుడు పదార్థాలను పసిగట్టాయని అధికారులు తెలిపారు. ఇందులో 80 శాతం నక్సల్ ప్రభావిత జిల్లాల నుంచే రికవరీ చేసుకున్నట్లు వెల్లడించారు. పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకోవడంలో శునకాల సాయం ఎనలేనిదని చెప్పారు. వీటిని ముందుగానే స్వాధీనం చేసుకోవడం వల్ల వేలాది మంది జవాన్ల ప్రాణాలను కాపాడినట్లైందని అన్నారు. ఛత్తీస్​గఢ్​లోని జగదల్​పుర్​లో జరుగుతున్న సీఆర్​పీఎఫ్ డే కార్యక్రమాల్లో భాగంగా ఈ వివరాలు వెల్లడించారు అధికారులు.

"అర కేజీ పేలుడు పదార్థాలు బ్లాస్ట్ అయితేనే అనేక మంది ప్రాణాలు కోల్పోతారు. అదే.. 5వేల కిలోల పేలుడు పదార్థాలు అంటే ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవచ్చు. ఈ పేలుడు పదార్థాల వల్ల జరిగే నష్టం అంచనా వేయలేం. ఎంతో మంది భద్రతా దళాల ప్రాణాలను ఈ శునకాలు కాపాడాయి."
-మహేంద్ర హెగ్డే, సీఆర్​పీఎఫ్ డీబీటీఎస్ డిప్యూటీ కమాండెంట్

వామపక్ష తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భద్రతా దళాలకు శునకాలు బాగా ఉపయోగపడుతున్నాయి. పేలుడు పదార్థాలను, అనుమానాస్పద వస్తువులను గుర్తించేలా వీటికి బెంగళూరులోని డాగ్ బ్రీడింగ్, ట్రైనింగ్ స్కూల్ (డీబీటీఎస్) శిక్షణ ఇస్తోంది. ప్రస్తుతం సీఆర్​పీఎఫ్ వద్ద 1500 శునకాలు ఉన్నాయి. అయితే, వీటి సంఖ్య మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు.

"ఇతర దళాలతో పోలిస్తే సీఆర్​పీఎఫ్ వద్దే శునకాలు అధికంగా ఉన్నాయి. సీఆర్​పీఎఫ్ ఆధ్వర్యంలో 1500 శునకాలు పని చేస్తున్నాయి. ఎందుకంటే మా పని అలాంటిది. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో వీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న శునకాలు మాకు సరిపోవు. వీటి సంఖ్య పెంచాల్సి ఉంది. క్షేత్రస్థాయిలో వీటిని ఉపయోగించడం వల్ల దళాలు మెరుగ్గా పనిచేయగలుగుతున్నాయి."
--మహేంద్ర హెగ్డే, సీఆర్​పీఎఫ్ డీబీటీఎస్ డిప్యూటీ కమాండెంట్

సీఆర్​పీఎఫ్ జవానుతో శునకం

బెంగళూరులోని బీడీటీఎస్​ను 2011లో ప్రారంభించారు. భద్రతాపరమైన సవాళ్లు ఎదుర్కొనేందుకు శునకాలు కచ్చితంగా ఉండాలని భావించి ఆ సంస్థను ఏర్పాటు చేశారు. తొలుత బెల్జియం షెపర్డ్, డచ్ షెపర్డ్ జాతులను నియమించుకున్నట్లు సీఆర్​పీఎఫ్ అధికారులు వెల్లడించారు. వాటికి అన్ని రకాలుగా శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. ట్రైనింగ్ స్కూల్ ద్వారా.. వేలాది శునకాలకు శిక్షణ ఇచ్చి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మోహరించినట్లు వెల్లడించారు. జమ్ము కశ్మీర్, ఝార్ఖండ్, బిహార్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో వీటిని వినియోగిస్తున్నట్లు తెలిపారు. 'జమ్ము కశ్మీర్, ఛత్తీస్​గఢ్ వంటి రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు కఠినంగా ఉంటాయి. డ్యూటీ టైమ్ కూడా సుదీర్ఘంగా ఉంటుంది. అందుకే బెల్జియం షెపర్డ్, డచ్ షెపర్డ్​లను నియమించుకుంటున్నాం. ఇవి మా అవసరాలకు చక్కగా సరిపోతాయి. భారత్​లో విరివిగా దొరికే జర్మన్ షెపర్డ్, లాబ్రడార్​లకు ఈ సామర్థ్యం లేదు' అని మహేంద్ర హెగ్డే వెల్లడించారు.

"శునకం పుట్టిన 30 రోజుల తర్వాత దాన్ని తల్లి నుంచి వేరు చేసి నిర్వాహకుడికి ఇస్తాం. దాన్ని హ్యాండిల్ చేసే వ్యక్తి చేతుల్లోనే అంతా ఉంటుంది. దాని ఆరోగ్యం, శిక్షణ, ఇతర అవసరాలన్నీ వారే చూసుకోవాలి. శిక్షణ ఇచ్చే అధికారి శునకాల సైకాలజీతో పాటు మనుషుల సైకాలజీని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. శిక్షణ పూర్తైన తర్వాత వాటిని సీఆర్​పీఎఫ్ యూనిట్​కు అప్పగిస్తాం. రెండు నెలల ఫౌండేషన్ ట్రైనింగ్ తర్వాత.. వాటి పనితీరు ఆధారంగా తర్వాతి లెవెల్ శిక్షణ ఇస్తాం. ప్రతి శునకానికి ఇద్దరు నిర్వాహకులు ఉంటారు. ఒకరు లేకపోయినా.. మరొకరు దాని బాధ్యతలు చూసుకుంటారు. రహస్యంగా దాక్కున్న శత్రువులను గుర్తించడం, ఐఈడీలను కనుగొనడం, దేశవ్యతిరేక కార్యకలాపాలను పసిగట్టడాన్ని శునకాలకు నేర్పిస్తాం."
-మహేంద్ర హెగ్డే, సీఆర్​పీఎఫ్ డీబీటీఎస్ డిప్యూటీ కమాండెంట్

సీఆర్​పీఎఫ్ శునకాలు

రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇలా..
సీఆర్​పీఎఫ్​లో సేవలందించిన శునకాలకు పదవీ విరమణ తర్వాత కూడా సౌకర్యాలు ఉంటాయని మహేంద్ర హెగ్డే చెబుతున్నారు. 'శిక్షణ పూర్తైన తర్వాత కఠిన ప్రాంతాల్లో శునకాన్ని, దాని నిర్వాహకులకు పోస్టింగ్ ఇస్తాం. రిటైర్మెంట్​కు సంబంధించి కూడా స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. ఎనిమిదేళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న శునకాలకు.. ఫిట్​నెస్ టెస్టులు చేస్తాం. ఫిట్​గా ఉందని తెలిస్తే.. సర్వీసును మరో ఏడాది పెంచుతాం. రిటైర్మెంట్ అయిన తర్వాత వాటన్నింటినీ స్కూల్​లోనే ఉంచుతాం. పని చేసిన సమయంలో వాటికి ఎంత ఆహారం ఇస్తామో.. అందులో 70 శాతం రేషన్​ రూపంలో అందిస్తాం. అది కన్నుమూసే వరకు గౌరవంగా చూసుకుంటాం' అని మహేంద్ర తెలిపారు.

సీఆర్​పీఎఫ్ శునకం

ABOUT THE AUTHOR

...view details