పదేళ్ల బాలుడ్ని మింగేసిందంటూ ఓ మొసలిని బంధించారు మధ్యప్రదేశ్ ష్యోపుర్ జిల్లా రిఝెంటా గ్రామ ప్రజలు. కడుపులో 'సజీవంగా' ఉన్న ఆ బాలుడ్ని ఎలాగైనా బయటకు కక్కేలా చేయాలని మకరాన్ని నానా హింసలు పెట్టారు. చివరకు పోలీసులు, అటవీ శాఖ అధికారుల జోక్యంతో మొసలిని విడిచిపెట్టారు. ఆ బాలుడు నదిలో మునిగి చనిపోయాడని కాసేపటి తర్వాత తెలుసుకున్నారు.
ఊరంతా ఏకమై..
రిఝెంటా గ్రామానికి చెందిన పదేళ్ల బాలుడు అతర్ సింగ్ సోమవారం సాయంత్రం చంబల్ నదిలో స్నానానికి వెళ్లాడు. కాసేపటి తర్వాత కనిపించకుండా పోయాడు. నదిలోని మొసలి బాలుడ్ని మింగేసిందని గ్రామస్థులంతా అనుకున్నారు. ఓ పెద్ద వల తెచ్చి ఆ మకరాన్ని పట్టుకున్నారు. ఒడ్డుకు లాక్కొచ్చి తాళ్లతో కట్టేశారు. బాలుడు మొసలి కడుపులో సజీవంగా ఉన్నాడని, ఎలాగైనా బయటకు కక్కేలా చేయాలని భావించారు. అప్పటివరకు లోపల ఉన్న బాలుడికి ఆక్సిజన్ అందడం కోసం.. మొసలి నోరు తెరిచే ఉంచేలా పెద్ద కర్ర పెట్టారు. ఇలా అయితే లాభం లేదని.. మకరం పొట్ట చీల్చి, బాలుడ్ని బయటకు లాగాల్సిందేనని మరికొందరు ప్రతిపాదించారు.