పంజాబ్ కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, కీలక నేత నవజోత్ సింగ్ సిద్ధూ మధ్య వివాదం రోజు రోజుకు ముదురుతోంది. నిత్యం పరస్పర విమర్శలతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మరి కొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇది ఎటువైపు దారి తీస్తుంది? కొంతకాలంగా జరుగుతున్న ఈ వివాదంపై హైకమాండ్ చర్యలేమిటి? సంక్షోభంలోకి వెళుతున్న కాంగ్రెస్‌లో చీలిక తప్పదా? ఓసారి పరిశీలిస్తే..
ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌తో వివాదం ముదిరిన నేపథ్యంలో ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు నవజోత్ సింగ్ సిద్ధూ. రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో హైకమాండ్‌కు నిజాలు తెలియజేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కోరారు. గురు గ్రంథ్ సాహిబ్ కోసం త్యాగం చేసిన వారికి న్యాయం చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో అదే ప్రధాన అజెండాగా ప్రచారం నిర్వహించానని పేర్కొన్నారు. పోలీసుల కాల్పుల కేసుపై చర్యలకు సీఎంపై ఒత్తిడి తెచ్చేందుకు ఇటీవల ఎమ్మెల్యేలు, మంత్రుల భేటీలోనూ సిద్ధూ ప్రయత్నించారు. ఆయా కేసుల్లో దోషులను సీఎం కాపాడుతున్నారని పరోక్షంగా ఆరోపించారు.
వివాదం ఏమిటి?
2017లో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్‌పై అమృత్‌సర్ తూర్పు స్థానం నుంచి సిద్ధూ విజయం సాధించిన తర్వాత మంత్రివర్గంలో చోటు దక్కింది. ఆ తర్వాత పలు కార్యక్రమాల్లో సిద్ధూ పాల్గొనటం ముఖ్యమంత్రికి నచ్చలేదు. ముఖ్యంగా 2018లో పాకిస్థాన్ పర్యటన చేపట్టి ఆ దేశ ఆర్మీ అధినేత కమార్ జావేద్ బజ్వాను కౌగిలించుకొని.. అత్యంత సన్నిహతంగా కనిపించటంపై నేరుగానే విమర్శలు గుప్పించారు అమరీందర్. ఆ తర్వాత కీలక శాఖలను తొలగించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో నవజోత్ కౌర్ సిద్ధూకు టికెట్ నిరాకరించారు. లోక్‌సభ ఎన్నికల్లో సిద్ధూ తీరు వల్లే పట్టణ ప్రాంతాల్లో కాంగ్రెస్ సరైన పనితీరును కనబర్చలేకపోయిందని విమర్శించారు. ఈ నేపథ్యంలో.. 2019 జులైలో కేబినెట్‌కు రాజీనామా చేశారు సిద్ధూ. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
2021, మార్చి 17న జరిగిన భేటీలో తమ మధ్య తలెత్తిన విబేధాలను తొలగించేందుకు ప్రయత్నించారు ఇరువురు నేతలు. వారి భేటీలో సానుకూల ఫలితం వచ్చినట్లు కనిపించింది. అయితే.. ఏప్రిల్ 9న కొట్కాపూర్ కాల్పుల కేసుపై సిట్ దర్యాప్తును పంజాబ్, హరియాణా హైకోర్టు రద్దు చేయటంతో ఇరువురి మధ్య సంబంధాలు మరింత దిగజారాయి. దోషులను శిక్షించటంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని సిద్ధూ విమర్శించారు.
ఈ క్రమంలో సిద్ధూ విమర్శలపై మౌనాన్ని వీడిన అమరీందర్ 2022 ఎన్నికల్లో పాటియాలా నుంచి పోటీ చేయాలని సవాల్ విసిరారు. సిద్ధూకు కనీస డిపాజిట్ కూడా రాదని ఎద్దేవా చేశారు. ఇతర పార్టీలో చేరాలని ఆయన కోరుకుంటున్నట్లు తెలిపారు. మరోవైపు.. సునీల్ జఖర్ స్థానంలో పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షునిగా బాధ్యతలు అప్పగించే అంశాన్ని తోసిపుచ్చారు. సిద్ధూకు ఉన్నత పదవి ఇవ్వాలన్న అంశాన్ని వ్యతిరేకిస్తున్నట్లు నొక్కి చెప్పారు. ఉప ముఖ్యమంత్రి వాదనలనూ తోసిపుచ్చారు.
ఎమ్మెల్యేలు కూడా..
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలలు మాత్రమే ఉన్న సమయంలో.. ఇద్దరు అగ్ర నేతల మధ్య వివాదం తారస్థాయికి చేరటం..కాంగ్రెస్‌ను సంక్షోభంలోకి నెడుతోంది. కొట్కాపుర్ కాల్పుల కేసులో హైకోర్టు తీర్పు నేపథ్యంలో సిద్ధూ అనుకూల ఎమ్మెల్యేలు సొంత ప్రభుత్వంపైనే విమర్శలకు దిగారు. దీంతో పార్టీ నేతల మధ్య విభేదాలు ముదురుతున్నాయని కొందరు కీలక నాయకులు పేర్కొన్నారు. పర్గత్ సింగ్ వంటి ఎమ్మెల్యేలు కొట్కాపుర్ దర్యాప్తులో ప్రభుత్వం తీరుపై నేరుగానే విమర్శలు చేశారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశం, ఎమ్మెల్యేలతో భేటీల్లో.. ఈ అంశాన్ని నేతలు లేవనెత్తినట్లు తెలుస్తోంది. కాల్పుల ఘటనలో ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం తగ్గిపోతుందని ఆరోపించారు. ఈ అంశంపై పీసీసీ చీఫ్ సునీల్ జఖర్ రాజీనామా చేస్తానని తెలపగా.. దానిని సీఎం తిరస్కరించారు. ప్రస్తుతం సీఎంపై విమర్శలను విస్తృతం చేశారు సిద్ధూ. దీంతో పార్టీ సంక్షోభంలోకి కూరుకుపోతోందని, చేయి దాటకముందే పార్టీ హైకమాండ్ కలుగజేసుకోవాలని పలువురు నేతలు కోరుతున్నారు.
ఆప్‌లోకి సిద్ధూ వెళతారా?