Criminal Law Bills Withdrawn :క్రిమినల్ చట్టాల స్థానంలో తెచ్చిన మూడు బిల్లులను ఉపసంహరించుకున్న కేంద్రం వాటి స్థానంలో కొత్తవి ప్రవేశపెట్టింది. లోక్‌సభ పార్లమెంటరీ స్థాయీ సంఘం చేసిన సిఫారసులను చేర్చి కొత్త ముసాయిదా బిల్లులను ప్రవేశపెట్టినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. క్రిమినల్ ప్రొసిజర్ యాక్ట్, ఇండియన్ పీనల్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో తెచ్చిన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం బిల్లులను తిరిగి డ్రాప్ట్ చేసి కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. హోంశాఖ పార్లమెంటు స్థాయీ సంఘం సిఫార్సుల మేరకు బిల్లులకు సవరణ చేయటానికి బదులు మార్పులతో కొత్తగా ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు అమిత్ షా చెప్పారు.
మూడు బిల్లులను అధ్యయనం చేయడానికి కొంత సమయం కావాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేయగా గురువారం చర్చ, శుక్రవారం ఓటింగ్ ఉంటుందని అమిత్ షా ప్రకటించారు. మూడు బిల్లులను అధ్యయనం చేయటానికి 48గంటల సమయం ఉందన్నారు. ప్రధానంగా 5 విభాగాల్లో మార్పులు చేశామని చెప్పారు. చాలావరకు వ్యాకరణం, భాషకు సంబంధించినవే అని తెలిపారు. 3 బిల్లులను జాయింట్ కమిటీకి సిఫార్సు చేయాలన్న ప్రతిపక్షాల విజ్ఞప్తిని తోసిపుచ్చారు. పార్లమెంటు స్థాయీ సంఘం అనేక సిఫార్సులు చేసినట్లు చెప్పారు. మూడు బిల్లులపై చర్చకు 12 గంటలు కేటాయించినట్లు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.
ఎలక్షన్ కమిషనర్ల బిల్లుకు రాజ్యసభ ఆమోదం
కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించి తీసుకొచ్చిన బిల్లును రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. 1991 నాటి చట్టం స్థానంలో కేంద్రం దీన్ని తీసుకొచ్చింది. పాత చట్టంలో ఉన్న కొన్ని బలహీనతలను సవరించేందుకు కొత్త చట్టం అవసరమైందని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ వ్యాఖ్యానించారు. సీఈసీ, ఈసీల నియామకాలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తప్పించుకునేందుకే ఈ బిల్లును తీసుకొచ్చారని విపక్షాలు చేసిన ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగానే ఈ బిల్లును తీసుకొచ్చినట్లు తెలిపారు.