Criminal Law Bill Passed :కేంద్రం ప్రవేశపెట్టిన మూడు నూతన క్రిమినల్ బిల్లులు లోక్‌సభ ఆమోదం పొందాయి. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య బిల్లులపై చర్చ, కేంద్రం సమాధానం అనంతరం మూడు బిల్లులకు దిగువసభ బుధవారం మూజువాణి ఓటుతో ఆమోదముద్ర వేసింది. నూతన బిల్లులపై లోక్‌సభలో జరిగిన చర్చకు సమాధానం ఇచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా భారతీయతను, రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతిబింబించేలా దేశ ప్రజల హితం కోరి నూతన క్రిమినల్ బిల్లులు తెచ్చినట్లు ప్రకటించారు. బ్రిటిష్ కాలం నాటి చట్టాలను నూతన బిల్లులు భర్తీ చేస్తాయని ఆయన ప్రకటించారు. ప్రజలకు న్యాయం చేసేందుకు నూతన చట్టాల్లో సాంకేతికతకు ప్రోత్సాహం ఇచ్చినట్లు చెప్పారు. మూక హత్యలను నేరంగా పరిగణించినట్లు చెప్పారు. బ్రిటిష్ చట్టాలు వారి రాజరిక పాలనను రక్షించుకునేందుకు తెస్తే, తాము ప్రజలే కేంద్రంగా నూతన బిల్లులను తెచ్చామన్నారు.
"మోదీ నేతృత్వంలో తెచ్చిన 3 బిల్లులు.. న్యాయం, సమానత్వం, నిష్పాక్షకత మూల సిద్ధాంతంగా చాలా పెద్ద మార్పులు తీసుకుని వచ్చాయి. సాంకేతికతతో చాలా ఉపయోగం ఉంటుంది కాబట్టి భవిష్యత్తులో సాంకేతికంగా ఏమేమి నూతన ఆవిష్కరణలు వచ్చే అవకాశం ఉందో ఊహించడం ద్వారా ఇప్పుడు ఈ చట్టాల్లో అనేక నిబంధనలు చేర్చాం. ఫోరెన్సిక్ సైన్స్‌ను ఈ చట్టాల్లో జోడించాం. ఈ చట్టాల ద్వారా త్వరగా న్యాయం చేసేందుకు పోలీసులు, న్యాయవాదులు, న్యాయమూర్తి అందరికీ తగిన సమయం ఇచ్చే ప్రయత్నం చేశాం."
--అమిత్ షా, కేంద్ర హోంమంత్రి
ఈ బిల్లులో ఉగ్రవాదానికి నిర్వచనం ఇచ్చామని అమిత్ షా తెలిపారు. రాజద్రోహాన్ని తొలగించి దాని స్థానంలో కొత్త సెక్షన్‌ను తీసుకొచ్చామన్నారు. తీవ్రవాద చర్యలకు పాల్పడే వారికి కఠినశిక్ష పడాల్సిందేనని స్పష్టం చేశారు. ఎవరైనా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే వారిని శిక్షించరాదన్న ఆయన, అది వారి భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పారు. సీఆర్‌పీసీలో 484 సెక్షన్లు ఉండగా కొత్త బిల్లులో 531 సెక్షన్లు చేర్చినట్లు వివరించారు. 177 సెక్షన్లలో మార్పులు చేసి 9 సెక్షన్లు అదనంగా చేర్చామని తెలిపారు. 39 సబ్ సెక్షన్లు, 44 నూతన ప్రొవిజన్లు చేరాయని అమిత్ షా అన్నారు.
"ప్రస్తుతం ఉన్న మూడు చట్టాలు విదేశీయులు తమ అధికారాన్ని చలాయించడానికి తీసుకొచ్చినవి. దేశంలో ప్రజలను బానిసలుగా చేసి వారిని పాలించాలని బ్రిటిషర్లు తీసుకొచ్చిన చట్టాలివి. వాటి స్థానంలో వస్తున్న కొత్త చట్టాలు మన రాజ్యాంగంలోని మూల సిద్ధాంతాలకు అనుగుణంగా ఉంటాయి. వ్యక్తి స్వేచ్ఛ, మానవ అధికారాలు, సమానత్వం ఈ మూడు మూల సిద్ధాంతాల ఆధారంగా కొత్త చట్టాలు రూపుదిద్దుకున్నాయి. పాత చట్టాలు, కొత్త చట్టాలకు ఇదే ప్రధానమైన తేడా. దీన్ని కొంత మంది గుర్తించలేకపోతున్నారు. పాత చట్టాలను జాగ్రత్తగా పరిశీలిస్తే వాటిలో న్యాయం చేయాలనే ఆలోచనే ఉండదు. శిక్షించడమే న్యాయం చేయడం అనే భావనలో అవి ఉన్నాయి. మన శాస్త్రాల్లో శిక్షించడం కంటే న్యాయం అందించడంపైనే దృష్టి ఎక్కువగా ఉంటుంది. బాధితుడికి న్యాయం అందాలనే ఉద్దేశంతోనే మన వద్ద శిక్ష విధిస్తారు."