చట్టసభ సభ్యులపై నమోదైన క్రిమినల్ కేసులను హైకోర్టుల అనుమతి లేకుండా దర్యాప్తు అధికారులు ఉపసంహరించరాదని స్పష్టం చేసింది సుప్రీం కోర్టు. ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల పర్యవేక్షణకు సుప్రీం కోర్టులో ఓ ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు.
చట్టసభ్యులపై దాఖలైన కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లపై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన కేసులను విచారిస్తున్న ప్రత్యేక కోర్టుల న్యాయమూర్తులను తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు బదిలీ చేయరాదని స్పష్టం చేసింది ధర్మాసనం. ప్రత్యేక కోర్టుల్లో చట్టసభ సభ్యులపై ఉన్న కేసులు, పెండింగ్‌లో ఉన్నవి, తీర్పులు వచ్చిన వాటిపై సమాచారం అందించాలని హైకోర్టుల రిజిస్ట్రార్ జనరల్‌లను ఆదేశించింది. సీనియర్ న్యాయవాదులు విజయ్ హన్సారియా, స్నేహ కలిత నుంచి నివేదికలు అందిన క్రమంలో ఈ ఆదేశాలిచ్చింది.