గణతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోట వద్ద హింసాత్మక ఘటనలకు సంబంధించి అరెస్టయిన పంజాబీ నటుడు దీప్ సిద్ధూను.. బెయిల్ మంజూరైన కొద్ది గంటల్లోనే మరోసారి అరెస్ట్ చేశారు దిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు. ఫిబ్రవరి 9న అరెస్టయిన దీప్ సిద్ధూకు.. బెయిల్ మంజూరు చేస్తూ శనివారం ఉదయం ఆదేశాలు జారీ చేసింది దిల్లీ న్యాయస్థానం. రూ. 30వేల పూచీకత్తుతో అతనికి బెయిల్ మంజూరు చేసింది కోర్టు. పాస్‌పోర్టును.. సంబంధిత దర్యాప్తు అధికారికి అందించాలని ఆదేశించింది. సమాచారం ఇచ్చినప్పుడు దర్యాప్తునకు హాజరుకావాలని సూచించింది.
జనవరి 26న ఎర్రకోట వద్ద రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా దీప్ సిద్ధూ.. రైతులను రెచ్చగొట్టి హింసకు కారణమయ్యారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. నాటి హింసలో దాదాపు 500 మంది పోలీసులు గాయపడ్డారు. ఈ ఘటనలో ఆయనపై వేర్వేరు కేసులు నమోదయ్యాయి.