కర్ణాటక శివమొగ్గలో భారీ వర్షాల కారణంగా ఓ వృద్ధురాలి అంత్యక్రియలు నిర్వహించడం ఇబ్బందిగా మారింది. దీంతో బంధువులు, గ్రామ ప్రజలు కలిసి ఆమె భౌతిక కాయానికి టార్పాలిన్ కింద దహన సంస్కారాలు చేశారు.
అసలేం జరిగిందంటే: శివమొగ్గ జిల్లా హునసవల్లి గ్రామానికి చెందిన భవానియమ్మ(70) అనే వృద్ధురాలు అనారోగ్యంతో మరణించింది. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆమె అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. అయితే వర్షం ఎడతెరపి లేకుండా కురుస్తోంది. ఆ గ్రామానికి శ్మశానం లేదు. చేసేదేమీలేక టార్పాలిన్ వేసి దాని కిందే వృద్ధురాలి అంత్యక్రియలను పూర్తి చేశారు. దీంతో ఇకనైనా ప్రభుత్వం స్పందించి శ్మశానాన్ని ఏర్పాటు చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.