Cremation of CDS Bipin Rawat: తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులికా రావత్ అంత్యక్రియలు దిల్లీలో శుక్రవారం జరగనున్నాయి. గురువారం సాయంత్రం వారి భౌతికకాయాలను సైనిక విమానంలో దిల్లీకి తరలించారు. ఈ మేరకు అధికార వర్గాలు తెలిపాయి.
రావత్ దంపతుల భౌతికకాయాలను శుక్రవారం వారి నివాసానికి తరలించి.. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. ఆ తర్వాత కామరాజ్ మార్గ్ నుంచి దిల్లీ కంటోన్మెంట్‌లోని బ్రార్ స్క్వేర్ శ్మశానవాటికకు అంతిమయాత్రగా తీసుకువెళ్లి.. అక్కడ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ప్రముఖుల నివాళి..
తమిళనాడు కూనూర్‌లో బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన భారత త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్‌తో పాటు 11 మంది సైనికుల పార్థివదేహాలను దిల్లీలోని పాలం ఎయిర్‌బేస్‌కు తీసుకువచ్చారు. ఎయిర్‌బేస్‌కు చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. అమరుల భౌతికకాయాలకు నివాళులర్పించారు. వారు కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.