తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వ్యవస్థతో పాటు మానవత్వాన్నీ అంతం చేసిన కరోనా! - మధ్యప్రదేశ్​లో శ్మశానంలో శవాలు

మానవాళిపై పంజా విసిరిన మహమ్మారి కరోనా ప్రభావం అంతా ఇంతా కాదు. వ్యవస్థల్లో ఉన్న లోపాలను సంపూర్ణంగా బట్టబయలు చేసిందీ ఈ వైరస్. కొవిడ్ వల్ల పలు రాష్ట్రాల్లో దయనీయమైన పరిస్థితులు తలెత్తుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం కోటలు దాటుతుంటే.. మరికొన్ని ప్రాంతాల్లో రక్త సంబంధాలు కూడా కరోనా ముందు దిగదుడుపుగా మారిపోతున్నాయి.

Cremation grounds, cemeteries bear the brunt as casualties rise
వ్యవస్థతో పాటు మానవత్వాన్నీ అంతం చేసిన కరోనా!

By

Published : Apr 22, 2021, 10:58 AM IST

కరోనా రెండో వేవ్ దేశాన్ని కుదిపేస్తోంది. రోజూ వందల మంది వైరస్​కు బలవుతున్నారు. శ్మశానాలు శవాలతో నిండిపోతున్నాయి. స్థలం లేక అంత్యక్రియలు నిర్వహించేందుకు మృతుల కుటుంబ సభ్యులు శ్మశానవాటికల ముందు పడిగాపులు కాస్తున్నారు. మృతదేహాలను ఖననం చేసేందుకు జేసీబీలతో భూమిని తవ్వడాన్ని చూస్తే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది. అన్ని రాష్ట్రాల్లో దాదాపు ఇదే దుస్థితి నెలకొంది. అయితే, కరోనా తొలి దశ వ్యాప్తి సందర్భంగా ఇలాంటి దృశ్యాలేవీ కనిపించకపోవడాన్ని గమనిస్తే.. అప్పటి పరిస్థితికి, ప్రస్తుత పరిణామాలకు తేడా స్పష్టమవుతుంది.

మరోవైపు, శ్మశానాలకు కుప్పలుతెప్పలుగా శవాలు వస్తుండటం, కరోనా మృతుల గురించి ప్రభుత్వాలు ప్రకటిస్తున్న గణాంకాలు అంతంతమాత్రంగా ఉండటం విస్మయపరుస్తోంది. ప్రభుత్వాలు వెల్లడిస్తున్న గణాంకాల వాస్తవికతపైనా అనుమానాలు తలెత్తుతున్నాయి.

గుజరాత్

గుజరాత్​లో కరోనా కేసులు, మరణాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రధాన నగరాలన్నీ వైరస్ వ్యాప్తి కేంద్రాలుగా మారిపోయాయి. సూరత్​లోని శ్మశానాలన్నీ మృతదేహాలతో నిండిపోయాయి. ఇక్కడి శ్మశానాల్లో చితిమంటలు.. 24 గంటలు మండుతూనే ఉన్నాయి.

సూరత్​లోని కురుక్షేత్ర శ్మశానవాటికలో గ్యాస్​తో నడిచే అంత్యక్రియల యంత్రాలు ఆరు ఉన్నాయి. రోజంతా ఇవి పనిచేస్తూనే ఉంటున్నాయి. శవాలను కాల్చేందుకు ఈ యంత్రాల్లో ఉష్ణోగ్రతను 600 డిగ్రీల వరకు పెంచుతారు. దీంతో ఈ యంత్రాలు, చిమ్నీలు వేడిని తట్టుకోలేక కరిగిపోయి పాడైపోతున్నాయి. నిరంతరం మరమ్మతులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. గతేడాది రోజుకు 20 శవాల వరకు వచ్చేవని.. ఇప్పుడా సంఖ్య ఐదు రెట్లు పెరిగిందని శ్మశానవాటిక నిర్వాహకులు చెబుతున్నారు.

శవాలను దహనం చేసే యంత్రం
వేడికి కరిగిపోయిన చిమ్నీ

జేసీబీలతో తవ్వకాలు

ఐదు రెట్లు అధికంగా శవాలు వస్తున్న నేపథ్యంలో వేగంగా సమాధులు తవ్వేందుకు కూలీలకు బదులు.. జేసీబీలను ఉపయోగిస్తున్నారు.

జేసీబీలతో సమాధుల తవ్వకాలు

అస్థికల కుప్పలు!

కరోనా మృతదేహాలతో పాటు అంత్యక్రియలు ముగిసిన తర్వాత సేకరించే అస్థికలు సైతం శ్మశానాల్లో పేరుకుపోతున్నాయి. వడోదరాలోని ఖేడీ శ్మశానవాటికలో అస్థికల కుండలు వందల సంఖ్యలో ఉండిపోయాయి.

మధ్యప్రదేశ్​లో

మధ్యప్రదేశ్​లో అంత్యక్రియల నిర్వహణా బాధిత కుటుంబాలకు పెను భారంగా మారుతోంది. భోపాల్​లో కరోనా ఉగ్రరూపం దాల్చుతున్న వేళ.. నగరంలోని శ్మశానాలకు భారీ సంఖ్యలో మృతదేహాలు వస్తున్నాయి. కరోనాతో చనిపోయినవారి అంత్యక్రియల కోసం ఇక్కడ రూ.3,500 వసూలు చేస్తున్నారు. సాధారణ మృతులకు రూ.3,100 ఛార్జ్ చేస్తున్నారు.

రోజుకు కనీసం 60-70 శవాలు భోపాల్​లోని బద్బదా శ్మశానవాటికకు వస్తున్నాయి. వీటికి కరోనా నిబంధనల ప్రకారం అంత్యక్రియలు చేస్తున్నారు. మిగితా శ్మశానాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. 24 గంటలు అంత్యక్రియలు జరుగుతున్నాయి.

పక్కపక్కనే పదుల సంఖ్యలో సమాధులు

సగం కాలిన శవాలు

ఛింద్వాడా జిల్లాలో కొవిడ్ కరోనా తీవ్రత అసాధారణంగా ఉంది. ఈ ఒక్క జిల్లాలోనే 450 కంటైన్మెంట్ జోన్లను అధికారులు ఏర్పాటు చేశారు. మరోవైపు, ఇక్కడి శ్మశానవాటికలో సగం కాలిన శవాలను.. పక్షులు, కుక్కలు పీక్కు తింటున్న దృశ్యాలు బయటకు రావడం అధికారుల నిర్లక్ష్యాన్ని తెలియజేస్తోంది.

అంత్యక్రియలకు టోకెన్లు

కరోనా మృతుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్​లో అధికారులు టోకెన్ సిస్టమ్​ను ప్రారంభించారు. మరణించినవారి కుటుంబ సభ్యులు ముందుగా శ్మశానవాటిక నిర్వాహకులను సంప్రదించి టోకెన్ తీసుకోవాల్సి ఉంటుంది. వారు చెప్పిన సమయానికి వచ్చి అంత్యక్రియలు పూర్తి చేసుకోవాలి.

లంచం ఇస్తేనే చివరి సంస్కారాలు

మధ్యప్రదేశ్ గ్వాలియర్​లో మున్సిపల్ అధికారులు.. అంత్యక్రియల కోసం లంచం తీసుకుంటున్న ఘటన వెలుగులోకి వచ్చింది. శవానికి దహన సంస్కారాలు నిర్వహించాలంటే రూ.8000 ఇవ్వాల్సిందేనని అధికారులు డిమాండ్ చేశారని మృతుల కుటుంబ సభ్యులు చెప్పుకొచ్చారు. బేరసారాల తర్వాత తొలుత రూ.6 వేలు అడిగి.. అనంతరం రూ.4 వేలకు తగ్గించారని తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం.. శ్మశానాల్లో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసింది. లంచం ఎవరు అడిగినా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

ఖాళీ స్థలాల్లో అంత్యక్రియలు

శ్మశానాల్లో ఉన్న ఘాట్లు సరిపోక.. ఖాళీ స్థలాల్లోనూ అంత్యక్రియలు నిర్వహిస్తున్న పరిస్థితి మధ్యప్రదేశ్​లోని విదిశా జిల్లాలో నెలకొంది. దీంతో, 10 శ్మశానవాటికలు నిర్మించేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తులు చేస్తోంది. వీటితో పాటు మూడు వేర్వేరు ప్రదేశాల్లో తాత్కాలికంగా శ్మశానాలను సిద్ధం చేస్తోంది.

శ్మశానం

రక్తసంబంధానికి పరీక్ష!

కొవిడ్ వ్యాధితో మరణించిన వ్యక్తులకు చివరి సంస్కారాలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు కూడా వెనకడుగు వేస్తున్నారు. తమకూ కరోనా సోకుతుందేమోనని కొందరు భయపడుతున్నారు.

ఇందోర్​లోని రాంబాగ్ ముక్తిధామ్​లో ఇలాంటి ఘటనే జరిగింది. కరోనాతో ఓ వ్యక్తి మరణించగా.. వారి అంత్యక్రియలకు కుటుంబ సభ్యులతో పాటు దగ్గరివారు కూడా ఎవరూ రాలేదు. పైగా, కొందరు దూరపు బంధువులు వచ్చి.. మరణించిన వ్యక్తి ఆభరణాలు తీసుకెళ్లిపోయారు. కొంతమందిలో మానవత్వం కూడా నశించిందనేందుకు ఇదే ఉదాహరణ.

ఛత్తీస్​గఢ్

దేశంలో రెండో దశ కరోనా వ్యాప్తికి తీవ్రంగా బలైన పది రాష్ట్రాల్లో ఛత్తీస్​గఢ్ ఒకటి. రాష్ట్ర వైద్య వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. శవాలను చెత్త బండ్లలో తీసుకెళ్లాల్సిన గత్యంతరం ఏర్పడింది. రాజనందగావ్ జిల్లాలోని డోంగర్​గఢ్ బ్లాక్​లో ఈ ఘటన జరిగింది. శ్మశానాలకు శవాలు తరలించేందుకు నగర పంచాయతీకి ఎలాంటి వాహనాలు లేనందునే చెత్త బండ్లను ఉపయోగించామని అక్కడి వైద్య శాఖ ఇచ్చిన వివరణ విమర్శలకు తావిస్తోంది.

మృతదేహాల తరలింపు కోసం ఉంచిన చెత్త వ్యాన్

శ్మశానానికి భారీగా కలప

దుర్గ్ జిల్లాలో కరోనా తీవ్రంగా ప్రబలుతోంది. రోజుకు 50కి పైగా శవాలకు ఇక్కడ అంత్యక్రియలు జరుగుతున్నాయి. దీంతో దహన సంస్కారాలు నిర్వహించేందుకు భారీగా కలప సిద్ధం చేశారు. శ్మశానం ముందు భారీ ఎత్తున కలపను నిల్వ ఉంచారు. 20-30 అడుగుల ఎత్తైన ఈ కలప కుప్పలు.. ఇక్కడి ప్రమాదకర స్థితిని తెలియజేస్తున్నాయి.

శవాల దహనం కోసం ఉంచిన కలప

దేశంలోని వివిధ ప్రాంతాల్లో వెలుగులోకి వస్తున్న ఈ ఘటనలన్నీ కరోనా ప్రమాదకర వ్యాప్తికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. దీంతో పాటు అంతరించిపోతున్న మానవత్వానికి నిలువుటద్దంగా మారుతున్నాయి.

ఇదీ చదవండి-కరోనాతో యూపీ విలవిల- వేధిస్తున్న ఆక్సిజన్​ కొరత!

ABOUT THE AUTHOR

...view details