'న్యాయవాదులు సమాజానికి దిక్సూచిగా నిలవాలి. అవసరమైన వారికి సాయం చేస్తూ ప్రజలకున్న హక్కుల పట్ల చైతన్యవంతుల్ని చేయాలి. న్యాయవాదులు వంతెనలు నిర్మించలేరు. టవర్లు కట్టలేరు. ఇంజిన్లు తయారు చేయలేరు. కానీ ఇబ్బందులను, ఒత్తిడిని తగ్గించగలుగుతారు. తప్పులను సరిదిద్దుతారు. ఇతరుల భారాలను స్వీకరించి, వారికి శాంతియుతమైన జీవితాన్ని ప్రసాదించగలుగుతారు' అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ పేర్కొన్నారు. సీజేఐ కావడంతోపాటు, చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఒకేసారి 9 మంది న్యాయమూర్తుల నియామకం చేపట్టిన సందర్భంగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) శనివారం ఆయన్ని సన్మానించింది. కొత్తగా బాధ్యతలు చేపట్టిన న్యాయమూర్తులు- జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సి.టి.రవికుమార్, జస్టిస్ పి.ఎస్.నరసింహ, జస్టిస్ సుందరేశ్‌లను గౌరవించింది. సీజేఐ మాట్లాడుతూ- న్యాయమూర్తుల నియామక ఖ్యాతి అంతా కొలీజియానికే దక్కుతుందన్నారు. 'నేను తెందుల్కర్ కాదు. ఒకవేళ తెందుల్కర్ ఉన్నా మొత్తం జట్టు ఆడితేనే మనం మ్యాచ్ గెలవగలుగుతాం' అనిపేర్కొన్నారు.
న్యాయవాదిగానే జీవితాన్ని ఎక్కువ ఆస్వాదించాను
'ఈ అభిమానం, గౌరవం నా బాధ్యతలను మరింత పెంచాయి. దీన్ని నా బాధ్యతలను గుర్తుచేసే కార్యక్రమంగా భావిస్తున్నాను. బార్ అసోసియేషన్, బార్ కౌన్సిళ్లంటే నాకు చాలా అభిమానం. న్యాయమూర్తిగా కంటే న్యాయవాదిగానే నేను జీవితాన్ని ఎక్కువ ఆస్వాదించాను. న్యాయవాదులు స్వతంత్ర వ్యక్తులు. న్యాయమూర్తి పదవి పూర్తి బాధ్యతాయుతమైనదన్న విషయంలో సందేహం లేదు. న్యాయవాదులు, న్యాయమూర్తులు అయ్యేందుకు సమాజంలోని అన్ని వర్గాలవారికీ ఇప్పుడు అవకాశాలు తెరచుకుంటున్నాయి. అత్యధికమంది మహిళా న్యాయవాదులు ఈ వృత్తిలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతమంది మహిళలకు మాత్రమే అత్యున్నత స్థానంలో ప్రాతినిధ్యం లభిస్తోంది. ఎన్నో కష్టాలను ఎదుర్కొని ప్రస్తుతం సుప్రీంకోర్టు ధర్మాసనాల్లో మహిళలకు 11% ప్రాతినిధ్యం కల్పించగలిగాం.
కార్పొరేట్ ధరతో సామాన్యులు న్యాయసలహా పొందలేరు
విదేశాల తరహాలో మనవద్దా న్యాయవాద వృత్తి కార్పొరేటీకరణ జరుగుతోంది. జీవనోపాధి కోసం ఎంతోమంది ప్రతిభావంతులైన యువ న్యాయవాదులు న్యాయసంస్థల్లో ఉద్యోగులుగా చేరిపోతున్నారు. ఈ మార్పును స్వాగతించాల్సిందే. సంప్రదాయబద్ధమైన న్యాయవాద వృత్తిలోకి వచ్చేవారు తగ్గిపోతుండటం మాత్రం ఆందోళనకరం. కార్పొరేట్ ధరలు పెట్టి సామాన్యులు న్యాయసలహా పొందలేరు. ఎక్కువ ఖర్చు, సుదీర్ఘ సమయం తీసుకోవడం న్యాయ ప్రక్రియకు పెను సవాల్‌గా మారింది. మౌలిక వసతుల లేమి, పరిపాలనా సిబ్బంది కొరత, న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉంటుండడం వంటి సమస్యలను న్యాయవ్యవస్థ ఎదుర్కొంటోంది. రోజంతా కోర్టుల్లో ఉంటూ న్యాయస్థాన ప్రాంగణాల్లో మరుగుదొడ్లు లేక మహిళా న్యాయవాదులు ఇబ్బందులు పడుతుంటారు. కక్షిదారులకు కోర్టుల్లో ఎలాంటి సౌకర్యాలూ లభించడంలేదు. నేను దేశం నలుమూలల నుంచి సమాచారం సేకరించి ఒక పెద్ద నివేదికను తయారుచేశాను. మరో వారం రోజుల్లో దాన్ని న్యాయశాఖ మంత్రికి సమర్పించబోతున్నాను. నేను బాధ్యతలు చేపట్టిన తర్వాత వివిధ హైకోర్టుల జడ్జీల పదవులకు 82 పేర్లను సిఫార్సు చేశాం. హైకోర్టుల్లో ఉన్న 41% ఖాళీల భర్తీ చాలా పెద్ద పనే.
వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత లాయర్లదే