Cracker Godown Explosion In Tamilnadu : తమిళనాడు.. కృష్ణగిరి ప్రాంతంలో బాణసంచా భద్రపర్చిన గోదాంలో పేలుడు సంభవించి ముగ్గురు మహిళలు సహా 9 మంది మృతిచెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ గోదాం నివాస సముదాయాల మధ్యలో ఉండటం వల్ల పేలుడు ధాటికి మూడు ఇళ్లు కుప్పకూలాయి. కొందరు ఈ భారీ పేలుడు వల్ల 200 మీటర్ల దూరంలో పడిపోయారు. మరోవైపు.. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని కృష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. శిథిలాల కింద చిక్కుకున్నవారి కోసం సహాయక చర్యలు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
బాణసంచా గోదాంలో పేలుడులో రవి (45), అతడి భార్య జయశ్రీ (40), రితిక (17), రితీశ్ (15), ఇబ్రా (22), సిమ్రాన్ (20), సరసు (50), రాజేశ్వరి (50) మృతి చెందారని పోలీసులు తెలిపారు. గ్యాస్ సిలిండర్ లీకేజీ వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. మరోవైపు.. కృష్ణగిరి జిల్లా కలెక్టర్ సరయు, ఎస్పీ సరోజ్ కుమార్ ఠాగూర్, కృష్ణగిరి ఎమ్మెల్యే అశోక్ కుమార్ స్వయంగా ఘటనాస్థలికి పరిశీలించారు.
ప్రధాని మోదీ, షా తీవ్ర విచారం
ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడ్డ వారికి రూ. 50వేలు పరిహారం ప్రకటించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈ ప్రమాదంపై స్పందించిన ముఖ్యమంత్రి స్టాలిన్.. మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. మృతులకు రూ.3 లక్షలు, తీవ్రంగా గాయపడినవారికి రూ. లక్ష, స్వల్ప గాయాలపాలైన వారికి రూ. 50వేలు పరిహారాన్ని ప్రకటించారు.
బాణాసంచా పరిశ్రమలో పేలుడు.. 9మంది మృతి..
కొన్నాళ్ల క్రితం తమిళనాడు కాంచీపురంలోని ఓ బాణసంచా పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు వల్ల 9 మంది మరణించారు. భారీ శబ్దంతో ఒక్కసారిగా పేలుడు సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాద సమయంలో ఆ బాణసంచా ప్లాంటులో 30 మందికిపైగా పనిచేస్తున్నట్లు స్థానికులు వెల్లడించారు. సమాచారం అందుకున్న కాంచీపురం అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు.. ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను కాంచీపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం జరిగిన పరిశ్రమలో. 20 ఏళ్లకు పైగా బాణసంచా తయారు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.