Cracker Factory Blast In West Bengal :బంగాల్.. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. పలువురు గాయపడినట్లు వెల్లడించారు. మృతుల్లో మహిళలు ఉన్నట్లు చెప్పారు.
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. దత్తపుకుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నీల్‌గంజ్ ప్రాంతంలో ఉన్న మోష్‌పోల్‌లో అక్రమంగా నిర్వహిస్తున్న ఓ బాణసంచా ఫ్యాక్టరీలో ఈ ఘటన జరిగింది. ఆదివారం ఉదయం కార్మికులు పనిచేస్తుండగా.. అకస్మాత్తుగా పేలుడు (Blast In Crackers Factory) సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఘటనా స్థలంలో మృతదేహాల శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయని స్థానికులు తెలిపారు. మృతుల శరీర భాగాలు పక్కనున్న ఇళ్లపై, చెట్లపై కూడా పడ్డాయని చెప్పారు. ఈ ప్రమాదంలో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు.
ఈ ఫ్యాక్టరీలో బాణసంచా తయారీని నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా.. పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల అండదండలతోనే ఆ ఫ్యాక్టరీలో బాణసంచా తయారీ కొనసాగుతోందని ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలంలో రక్తపు మరకలతో ఉన్న మృతదేహాలను చూశానని ఓ స్థానికుడు తెలిపాడు. పేలుడు తర్వాత ఇంటి నుంచి బయటకు రాలేకపోయినా.. ఇతరులతో కలిసి రక్షించానని చెప్పాడు.