తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కొవిన్‌ పోర్టల్‌ సేఫ్​.. డేటా లీక్‌ వార్తలను కొట్టిపారేసిన కేంద్రం - కొవిన్ యాప్ డేటా చోరీ

Cowin App Data Leak : కొవిన్ పోర్టల్ డేటా లీక్ అయిందన్న వార్తలను కేంద్రం ఖండించింది. డేటా తస్కరణకు సంబంధించిన వార్తలన్నీ నిరాధారమని పేర్కొంది. దీనిపై విచారణ జరిపి పూర్తి నివేదికను అందించాల్సిందిగా CERTని కోరినట్లు కేంద్రం తెలిపింది.

cowin app data leak
కొవిన్ యాప్ డేటా చోరీ

By

Published : Jun 12, 2023, 5:39 PM IST

Updated : Jun 12, 2023, 6:23 PM IST

Cowin App Data Leak : కొవిన్ పోర్టల్ డేటా లీక్ వార్తలను కేంద్రం కొట్టిపారేసింది. కొవిన్ పోర్టల్​లో డేటా సురక్షితంగా ఉన్నట్లు పేర్కొంది. డేటా లీక్​పై వార్తలన్నీ నిరాధారమైనవని తెలిపింది. దీనిపై విచారణ జరిపి.. పూర్తి నివేదికను అందించాల్సిందిగా CERTని కోరినట్లు కేంద్రం పేర్కొంది.
అంతకుముందు.. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌కు ఉద్దేశించిన 'కొవిన్‌' పోర్టల్‌లోని సున్నితమైన సమాచారం బయటకొచ్చినట్లు 'మలయాళ మనోరమ' పత్రిక పేర్కొంది. వ్యక్తుల పేర్లు, ఫోన్‌ నంబర్లు, ఆధార్‌, పాన్‌ తదితర వివరాలు టెలిగ్రామ్‌లో ప్రత్యక్షమయ్యాయని తెలిపింది. ఎవరైనా ఈ డేటాను యాక్సెస్‌ చేసే విధంగా అందుబాటులోకి వచ్చిందన్న వార్తలు కలకలం రేపాయి.

మరోవైపు.. కొవిన్ పోర్టల్ డేటా లీక్ అయ్యిందన్న వార్తలపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. ' కొవిన్ యాప్​ డేటా నేరుగా లీక్ అయినట్లు కనిపించడం లేదు. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలు అవాస్తవం. దీనిపై సీఈఆర్‌టీ నివేదిక అందిస్తుంది.' అని రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు.

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కోసం 'కొవిన్‌' పేరిట ప్రత్యేక పోర్టల్‌ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అందులో ఫోన్‌ నంబర్‌, ఆధార్‌ నంబర్‌ వివరాలు నమోదు చేయడం ద్వారా వ్యక్తులు టీకా తీసుకున్నారు. ఒకే ఫోన్‌ నంబర్‌తో కుటుంబంలోని పలువురు టీకాలు వేయించుకున్నారు. ఇందులో వ్యక్తుల పేర్లు, ఆధార్‌ వివరాలు, ఫోన్‌ నంబర్‌తో పాటు ఏయే తేదీల్లో ఎక్కడ వ్యాక్సిన్‌ వేసుకున్నారు వంటి సమాచారం ఉంటుంది. ఇంతటి కీలక సమాచారం మెసెంజర్‌ యాప్‌ టెలిగ్రామ్‌లో సోమవారం వెలుగుచూసినట్లు వార్తలు వచ్చాయి. టెలిగ్రామ్‌లోని ఓ బాట్‌లో వ్యక్తుల ఫోన్‌ నంబర్‌ ఎంటర్‌ చేస్తే వారి సమస్త సమాచారం వచ్చినట్లు సమాచారం. ఆధార్‌ వివరాలు ఎంటర్‌ చేసినా వివరాలు వచ్చాయని ప్రచారం జరిగింది. విదేశాలకు వెళ్లేందుకు కొందరు కొవిన్‌ పోర్టల్‌లో పాస్‌పోర్ట్‌ వివరాలు కూడా అందించారని.. అలాంటి వారి డేటా సైతం డేటా లీకేజీలో బయటకొచ్చినట్లు ప్రచారం జరిగింది.

వ్యక్తుల డేటా ఇలా బయటకు వచ్చిందన్న సమాచారం అనంతరం చాట్‌బాట్‌ నిలిచిపోయిందని వార్తలు వచ్చాయి. అయితే.. సాధారణంగా కొవిన్‌ పోర్టల్‌లో లాగిన్‌ అయినప్పుడు.. మొబైల్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్‌ చేసినప్పుడు మాత్రమే ఈ సమాచారం కనిపిస్తుంది. అలాంటిది.. ఎలాంటి ఓటీపీలతో సంబంధం లేకుండా ఈ డేటా బయటకు వచ్చిందన్న ప్రచారం కలకలం రేపింది.

"లీకైన డేటాలో పలువురు ప్రభుత్వ అధికారులతో పాటు, రాజకీయ నాయకుల పేర్లు, వారి వ్యక్తిగత వివరాలూ ఉన్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ ఫోన్‌ నంబర్‌ ఎంటర్ చేస్తే ఆయన పూర్తి వివరాలు వస్తున్నాయి" అని మలయాళ మనోరమ పత్రిక పేర్కొంది. ఆయనతో పాటు కాంగ్రెస్‌ నేతలు జైరామ్‌ రమేశ్‌, కేసీ వేణుగోపాల్‌, పి.చిదంబరం, టీఎంసీ ఎంపీ డెరెక్‌ ఓబ్రెయిన్‌ వంటి నేతల వివరాలు బయటకొచ్చాయని తెలిపింది. ఈ డేటా లీకేజీపై తృణమూల్‌ కాంగ్రెస్ అధికార ప్రతినిధి సాకేత్‌ గోఖలే స్పందించారు. ఇది తీవ్రమైన అంశమని పేర్కొంటూ ప్రధాని మోదీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. సంబంధిత స్క్రీన్‌షాట్లను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఈ నేపథ్యంలో కొవిన్ పోర్టల్​ డేటా లీక్ అయ్యిందన్న వార్తలను కేంద్రం ఖండించింది.

Last Updated : Jun 12, 2023, 6:23 PM IST

ABOUT THE AUTHOR

...view details