దేశంలో ప్రస్తుతం అత్యధికంగా సంక్రమిస్తున్న డెల్టా రకం కరోనా వైరస్‌తోపాటు ఆల్ఫా, బీటా, గామా వేరియంట్లపైనా కొవాగ్జిన్(covaxin), కొవిషీల్డ్(covishield) టీకాలు రెండూ ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు భారత వైద్య పరిశోధన మండలి (ICMR) డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ తెలిపారు. 'డెల్టా ప్లస్' రకం వైరస్‌పై వీటి ప్రభావం విషయమై ప్రస్తుతం అధ్యయనాలు కొనసాగుతున్నట్లు చెప్పారు. దిల్లీలో ఆయన శుక్రవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాల పనితీరును వివరించారు. "కొవాగ్జిన్ టీకా కరోనా తొలిరకంపై ఎంత సమర్థంగా పనిచేస్తోందో అదేస్థాయిలో ఆల్ఫా రకం వైరస్‌పైనా పూర్తి సమర్థతతో పనిచేస్తోంది. ఈ రకంపై కొవిషీల్డ్ వ్యాక్సిన్ సామర్థ్యం స్వల్పస్థాయిలో తగ్గుతోంది. కొద్దితేడాలున్నా కొవాగ్జిన్, కొవిషీల్డ్‌లు ఆల్ఫా, బీటా, గామా, డెల్టా వైరస్‌లపై బాగా పనిచేస్తున్నట్లు తేలింది" అని వెల్లడించారు.
'డెల్టా ప్లస్'పై అధ్యయనం..
డెల్టా ప్లస్(Delta plus variant) రకానికి సంబంధించి టీకాల సామర్థ్యం ఎంతమేరకు ఉందన్న విషయంపై ప్రయోగశాలల్లో పరిశీలిస్తున్నట్లు బలరాం భార్గవ తెలిపారు. ఈ అధ్యయన ఫలితాలు 10 రోజుల్లో వెల్లడి కావచ్చన్నారు. ప్రపంచంలో అందుబాటులోకి వచ్చిన తొలి ఫలితాలు ఇవే అవుతాయన్నారు. అవసరమైతే వీటి ఆధారంగా వ్యాక్సిన్లలో మార్పులపై నిర్ణయం ఉండొచ్చని చెప్పారు.దేశంలో కరోనా రెండో ఉద్ధృతి అయిపోలేదని, ఇప్పటికీ 75 జిల్లాల్లో ఇంకా 10%కి మించి పాజిటివిటీ రేటు ఉందని బలరాం భార్గవ చెప్పారు. "92 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5-10% ఉంది. ఈ నేపథ్యంలో మూడో ఉద్ధృతిని తప్పించాలంటే వ్యక్తిగతంగా, మాస్కులు ధరించాలి, ప్రాధాన్యక్రమంలో టీకాలు అందించాలి" అని స్పష్టం చేశారు. దేశంలో కరోనా వైరస్ ఆందోళనకర రకాలను 35 రాష్ట్రాల్లోని 174 జిల్లాల్లో కనుగొన్నట్లు జాతీయ అంటువ్యాధుల నియంత్రణ సంస్థ డైరెక్టర్ సుజీత్ కుమార్ సింగ్ తెలిపారు.