వ్యాక్సిన్ పంపిణీ కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో దిల్లీలోని మౌలానా ఆజాద్ మెడికల్ కళాశాల కమ్యూనిటీ మెడిసిన్ డైరెక్టర్ డా. సునీలా గార్గ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి 2022 చివర్లో లేదా 2023 మొదట్లో కరోనా టీకా దేశ ప్రజలందరికీ అందుబాటులోకి వస్తుందని అంచనా వేశారు. కేంద్ర వైద్య శాఖకు సలహాదారుగా పనిచేస్తున్న గార్గ్.. ఈటీవీ భారత్కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
"ప్రతి ఒక్కరికి రెండు డోసుల వ్యాక్సిన్ అవసరం. దీని ప్రకారం మన కోల్డ్ స్టోరేజీ, సప్లై చైన్ సదుపాయాలను లెక్కలోకి తీసుకుంటే 2022 చివర్లో లేదంటే 2023 మొదట్లో భారత్లోని ప్రతి పౌరుడికి కొవిడ్ టీకా అందుతుంది. ఇది కూడా వ్యాక్సిన్ సరఫరా చేసే సంస్థలపై ఆధారపడి ఉంటుంది."
-డా. సునీలా గార్గ్, వైద్య నిపుణులు
137 కోట్ల జనాభా ఉన్న భారత్లో 80 శాతం మందికి(14 ఏళ్లలోపు వారిని మినహాయించి) తొలుత వ్యాక్సిన్ అందించే అవకాశం ఉందని పేర్కొన్నారు సునీలా గార్గ్. దాదాపు 25 శాతం మందికి యాంటీబాడీలు ఉంటాయని, వారు టీకా ప్రాధాన్య జాబితాలోకి రారని చెప్పుకొచ్చారు.