తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Covid Vaccine ICMR: కొవిడ్​ టీకాతో రోగ నిరోధకత 9 నెలలు

Covid Vaccine ICMR: కొవిడ్​ టీకాతో రోగ నిరోధక శక్తి తొమ్మిది నెలలు, అంతకంటే ఎక్కువ ఉండే అవకాశం ఉందని ఐసీఎంఆర్​ వెల్లడించింది. కరోనా వైరస్‌లో వివిధ రకాలు గతంలో శ్వాసనాళాల ద్వారా ఎలా వ్యాప్తి చెందాయో ఇప్పుడూ అలాగే వస్తున్నాయని, అందువల్ల చికిత్సకు మార్లదర్శకాల్లో ఎలాంటి మార్పు లేదని పేర్కొంది.

d
కరోనా వ్యాక్సిన్​తో రోగ నిరోధకత 9 నెలలు

By

Published : Dec 31, 2021, 5:20 AM IST

Covid Vaccine ICMR: కరోనా టీకా తీసుకోవడం వల్ల లభించే రోగ నిరోధక శక్తి తొమ్మిది నెలలు, అంతకంటే ఎక్కువ ఉండే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కరోనా బారిన పడినవారిలో రోగనిరోధకత కూడా దాదాపు అంతే సమయం ఉంటుందని వెల్లడించింది. టీకాలు తీసుకోవడం, ఇన్ఫెక్షన్‌ బారిన పడడంలో ఏదో ఒకటి మాత్రమే జరిగినవారితో పోలిస్తే ఆ రెండూ జరిగిన వారిలో రోగనిరోధక స్పందన ఎక్కువని 'భారతీయ వైద్య పరిశోధన మండలి' (ఐసీఎంఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవ తెలిపారు. టీకా తీసుకోవడానికి ముందు, ఆ తర్వాత కూడా మాస్కులు ధరించడం తప్పనిసరి అని స్పష్టంచేశారు. కరోనా వైరస్‌లో రకాలు గతంలో శ్వాసనాళాల ద్వారా ఎలా వ్యాప్తి చెందాయో ఇప్పుడూ అలాగే వస్తున్నాయని, అందువల్ల చికిత్సకు మార్లదర్శకాల్లో ఎలాంటి మార్పు లేదని చెప్పారు.

ఆరోగ్యరంగ సిబ్బంది సహా కరోనాపై పోరులో తొలివరసలో నిల్చొనేవారికి, 60 ఏళ్లు పైబడినవారికి ఇవ్వబోతున్న ముందస్తు డోసుతో తీవ్రస్థాయి ఇన్ఫెక్షన్‌, ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం, ప్రాణాపాయం వంటివి తగ్గేందుకు వీలుంటుందని పేర్కొన్నారు. టీకాలకు ఎంతో ప్రాధాన్యం ఉందని చెప్పారు. సహజసిద్ధ ఇన్ఫెక్షన్‌ తర్వాత రోగనిరోధక కణాల జ్ఞాపకశక్తి దాదాపు 9-10 నెలలు ఉంటుందన్నారు. "డెల్టా రకం కంటే ఒమిక్రాన్‌ 3-4 రెట్లు వేగంగా వ్యాపిస్తోంది. ప్రమాదాన్ని తగ్గించేందుకు ముందుజాగ్రత్త డోసు ఉపయోగపడుతుంది. వయోధికలు, రోగనిరోధకత తక్కువగా ఉన్నవారు, కీమోథెరపీ చేయించుకుంటున్నవారు, శ్వాసకోశ వ్యాధులున్న వారు తీవ్రమైన ఇబ్బందుల్లో పడకుండా ఇది దోహదపడుతుంది" అని భార్గవ పేర్కొన్నారు. కరోనా కేసులు పెరుగుతున్నందుకు భయపడాల్సిన అవసరం లేదని, దీనిని ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సన్నద్ధతతో ఉన్నామని చెప్పారు.

ఇదీ చూడండి :మహారాష్ట్రలో 5వేల కరోనా కేసులు.. దిల్లీలో రికార్డు స్థాయిలో..

ABOUT THE AUTHOR

...view details