vaccination for 5-12 age group: దేశంలోని 5-12 ఏళ్ల వయసు గల చిన్నారులకు కరోనా టీకా పంపిణీ చేసే విషయమై శుక్రవారం కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. నిపుణుల కమిటీ ఇచ్చే సిఫార్సుల ఆధారంగా ఐదేళ్లు పైబడిన పిల్లలకు వ్యాక్సిన్ అందించే అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు.
Covid Vaccination 5-12 kids: టీకా పంపిణీపై ఏర్పాటు చేసిన సాంకేతిక సలహా బృందం(ఎన్టీఏజీఐ) సమావేశం శుక్రవారం జరగనుంది. చిన్నారులందరికీ టీకా పంపిణీ చేయడాన్ని ప్రభుత్వం ప్రాధాన్య అంశంగా పరిగణిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇదివరకే స్పష్టం చేశారు. కరోనా పరిస్థితులపై బుధవారం వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. పాఠశాలలో 'ప్రత్యేక క్యాంపెయిన్'లు నిర్వహించి పిల్లలందరికీ టీకాలు వేస్తామని చెప్పారు.
కాగా, ఈ వయసు చిన్నారులకు 'బయోలాజికల్ ఇ' తయారు చేసిన కొవిడ్ టీకా కార్బెవాక్స్ అందుబాటులోకి వచ్చింది. మంగళవారమే ఈ టీకాకు అత్యవసర అనుమతులు మంజూరు అయ్యాయి. ఈ టీకాను 12-14 ఏళ్ల వయసు పిల్లలకు ఇప్పుడు ఉపయోగిస్తున్నారు. భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ చిన్నారుల టీకాకు సైతం ఇదివరకు అత్యవసర అనుమతులు లభించాయి. ఈ టీకాను 6 నుంచి 12 ఏళ్ల వయసు పిల్లలకు వేయవచ్చు.