కరోనా వ్యాక్సిన్ల కొరతను రాష్ట్రాలు తీవ్రంగా ఎదుర్కొంటున్నాయి. దీంతో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. 18 నుంచి 44 ఏళ్ల వయస్సు మధ్య వారికి టీకా ఇచ్చే కార్యక్రమాన్ని వాయిదా వేయాలని మహారాష్ట్ర సర్కారు నిర్ణయించింది. కర్ణాటక ప్రభుత్వం కూడా 44ఏళ్ల లోపువారికి టీకా పంపిణీ ప్రక్రియ తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపింది. దిల్లీ కూడా కొవాగ్జిన్ నిర్వహణ కేంద్రాలను తాత్కాలికంగా మూసివేసింది. మరికొన్ని రాష్ట్రాల్లో 45 ఏళ్లు పైబడి వారికి కూడా రెండో డోసు మాత్రమే ఇస్తున్నాయి.
గ్లోబల్ టెండర్లకు రాష్ట్రాల ప్రకటన
టీకాల కొరతను అధిగమించేందుకు ఇప్పటికే దిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు గ్లోబల్ టెండర్లు ప్రకటించగా.. తాజాగా రాజస్థాన్, తమిళనాడు ఈ జాబితాలో చేరాయి. రానున్న రెండు నెలల్లో రాష్ట్రానికి 20 లక్షల డోసుల స్పుత్నిక్ వ్యాక్సిన్‌ను దిగుమతి చేసుకోనున్నట్లు ఉత్తరాఖండ్ అధికారులు తెలిపారు.