కొవిడ్ చికిత్సలో యాంటీ బయాటిక్ ఔషధాలు ఉపయోగించకూడదని దేశంలోని వైద్యులకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. రోగిలో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ తలెత్తినట్లు అనుమానాలు వస్తేనే యాంటీబయాటిక్స్ ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ మేరకు వయోజనులకు కరోనా చికిత్సకు సంబంధించి సవరించిన మార్గదర్శకాలు విడుదల చేసింది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో ఈ మార్గదర్శకాలు రావడం గమనార్హం.
మార్గదర్శకాల సవరణ కోసం ఎయిమ్స్/ ఐసీఎంఆర్ కొవిడ్ నేషనల్ టాస్క్‌ఫోర్స్ జనవరి 5న భేటీ అయింది. లూపినవిర్, రిటోనవిర్, హైడ్రాక్సీక్లోరోక్విన్, ఐవర్‌మెక్టిన్, మోల్నుపిరవిర్, ఫావిపిరవిర్, అజిథ్రోమైసిన్, డాక్సీసైక్లిన్ ఔషధాలను కొవిడ్ రోగులకు ఇవ్వొద్దని తాజా మార్గదర్శకాల్లో కేంద్రం స్పష్టం చేసింది. ప్లాస్మా థెరపీని సైతం చేయవద్దని మార్గదర్శకాల్లో సూచించింది. రోగులకు కరోనాతో పాటు ఇతర అంటు వ్యాధులు ఏమైనా సోకుతున్నాయా అనే విషయాన్ని గమనిస్తూ ఉండాలని వైద్యులను అప్రమత్తం చేసింది.
"రోగికి కరోనాతో పాటు ఇతర వ్యాధులు ఉంటే ఐదు రోజుల వరకు రెమిడెసివిర్ ఇవ్వవచ్చు. వ్యాధి లక్షణాలు 10 రోజుల పాటు సాధారణం నుంచి తీవ్రస్థాయిలో ఉంటే.. ఈ ఔషధం ఇవ్వడం ప్రారంభించాలి. ఐదు రోజులకు మించి రెమిడెసివిర్ ఇవ్వడం ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉండదు. వెంటిలేషన్/ ఎక్మోపై ఉన్న రోగులకు వీటిని ఇవ్వకూడదు. ఇంట్లో చికిత్స చేసుకునేవారికి ఈ ఔషధం సిఫార్సు చేయకూడదు."
-కేంద్రం మార్గదర్శకాలు