కరోనా మూడో దశ వచ్చినా.. అది చిన్నారులపై ప్రభావం చూపే అవకాశాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్ధ (డబ్ల్యూహెచ్ఓ), ఎయిమ్స్ సంయుక్త అధ్యయనం స్పష్టం చేసింది. చిన్నారులు, వయోజనుల్లో సీరో పాజిటివిటీ రేటు.. కాస్త దగ్గరగా ఒకే స్ధాయిలో ఉందని తెలిపింది. ఈ అధ్యయనంలో భాగంగా.. ఈ ఏడాది మార్చి 15 నుంచి జూన్10 మధ్య దేశంలోని అయిదు ప్రాంతాల్లో రెండేళ్ల వయసు నుంచి వయోజనుల వరకు.... 4 వేల 59 నమూనాలను సేకరించారు. పూర్తి స్ధాయి అధ్యయనం ఇంకా కొనసాగుతున్నా.. ఇప్పటి వరకు గుర్తించిన వివరాలను నిపుణులు వెల్లడించారు.
సీరో పాజిటివిటీ రేటు 18 ఏళ్ల లోపు వారిలో 55.7శాతం, అంతకంటే ఎక్కువ వయసున్న వారిలో.. 63.5శాతం ఉందని తెలిపారు. ఇన్నాళ్లూ వయోజనుల స్థాయిలోనే పిల్లల్లోనూ కరోనా ప్రభావం చూపిందని దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చని చెప్పారు. కరోనా మూడో దశ వస్తే.. ప్రత్యేకంగా చిన్నారుల్లో ప్రభావం చూపిస్తుందనే ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు.