సులభతర వ్యాపారం కోసం దేశం అందించే అవకాశాలతో ప్రజల జీవనాన్ని మెరుగుపరచాలని యువతకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దిల్లీ ఐఐటీ స్నాతకోత్సవంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న ఆయన... కరోనా తర్వాత ప్రపంచంలో సమూల మార్పులు సంభవిస్తాయని అన్నారు. సాంకేతికత ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పారు. ప్రపంచీకరణ ఎంత ముఖ్యమో స్వయం సమృద్ధి సాధించడం అంతే ముఖ్యమని కరోనా ప్రపంచానికి చాటిచెప్పిందని పేర్కొన్నారు.
ఆవిష్కరణల నాణ్యతపై దృష్టిపెట్టాలని యువతకు మోదీ సూచించారు. ఈ విషయంలో రాజీ పడొద్దని అన్నారు. 'బ్రాండ్ ఇండియా'కు యువతే అసలైన ప్రచారకర్తలని పేర్కొన్నారు.
"సులభతర వాణిజ్యం కోసం యువతకు అవకాశాలు కల్పించేందుకు భారత్ కట్టుబడి ఉంది. దీన్ని ఉపయోగించుకొని తమ ఆవిష్కరణల ద్వారా యువత.. దేశంలోని కోట్లాది మంది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావచ్చు. మీ నైపుణ్యం, అనుభవం, ప్రతిభ, ఆవిష్కరణలతో ప్రతీపేద పౌరుడూ సులభంగా జీవించేలా కృషి చేయండి. కొవిడ్ మనకు చాలా నేర్పించింది. ప్రపంచీకరణ ముఖ్యమే, అదే సమయంలో స్వయం సమృద్ధి సాధించడం కూడా అంతే ముఖ్యం. కొత్త ఆవిష్కరణలను ప్రదర్శించే విధంగా యువతకు అవకాశాలు కల్పించడమే ఆత్మనిర్భర్ భారత్ ఉద్దేశం."