Covid Sub Variants: కరోనా కేసులు తగ్గాయని అంతా ఊపిరిపీల్చుకుంటున్న తరుణంలో ఒమిక్రాన్ ఉపవేరియంట్లు మళ్లీ కలకలం రేపుతున్నాయి. మహారాష్ట్రలో ఏడు ఒమిక్రాన్ ఉప వేరియంట్ కేసులు నమోదయ్యాయి. నాలుగు బీఏ.4 కేసులు, మూడు బీఏ.5 కేసులు నమోదైనట్టు వైద్యులు ప్రకటించారు. ఒమిక్రాన్ ఉపవేరియంట్ల బారిన పడిన ఏడుగురికీ స్వల్ప లక్షణాలే ఉన్నట్లు తెలిపారు. కాగా వీరంతా పుణెకు చెందినవారు కావడం గమనార్హం. వారందరినీ హోం ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు వివరించారు.
"జీనోమ్ సీక్వెన్సింగ్‌ను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నిర్వహించింది. ఈ సీక్వెన్సింగ్‌ను ఫరీదాబాద్‌లోని ఇండియన్ బయోలాజికల్ డేటా సెంటర్ ధృవీకరించింది. ఇందులో పుణెకు చెందిన ఏడుగురు ఒమిక్రాన్ ఉపవేరియంట్ల బారినపడినట్లు నిర్ధరణ అయ్యింది. వీరిలో నలుగురికి బీఏ.4 సోకగా, మరో ముగ్గురు బీఏ.5 ఉప వేరియంట్ బారినపడ్డారు. ఈ ఏడుగురిలో ముగ్గురు మహిళలతో పాటు తొమ్మిదేళ్ల బాలుడు కూడా ఉన్నాడు " అని వైద్యాధికారి పేర్కొన్నారు.