నిద్రపై కరోనా ప్రభావం.. 80శాతం మందికి సమస్యలు.. పీడకలలూ వైరస్ వల్లే! - International Covid Sleep Study
ప్రపంచానికి కొవిడ్-19 మిగిల్చిన చేదుజ్ఞాపకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. దీనివల్ల మానవుల్లో చోటుచేసుకున్న దీర్ఘకాల ప్రభావాలను శాస్త్రవేత్తలు గుర్తిస్తున్నారు. ఆ ఇన్‌ఫెక్షన్ మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ.. నిద్రకు విఘాతం కలిగిస్తోందని, పీడకలలకూ కారణమవుతోందని తాజా పరిశోధనలు నిగ్గుతేల్చాయి.
Etv కొవిడ్‌తో నిద్రలేమి సమస్యలు
By
Published : Jan 10, 2023, 7:03 AM IST
నిద్ర.. మానసిక, శారీరక ఆరోగ్యానికి చాలా కీలకం. మంచి నిద్ర వల్ల రోగనిరోధక వ్యవస్థ పటిష్ఠమై, ఇన్‌ఫెక్షన్లపై గట్టిగా పోరాటం చేయడానికి వీలవుతుంది. ఈ నేపథ్యంలో కరోనా వల్ల శయనంపై పడుతున్న ప్రభావం గురించి నిపుణులు నిశితంగా శోధించడం మొదలుపెట్టారు. మహమ్మారి విజృంభణ మొదలైన తొలినాళ్లలో.. లాక్‌డౌన్ల వల్ల విశ్రమించే పోకడలపై పడే సానుకూల, ప్రతికూల ప్రభావాలను పరిశీలించారు. లాక్‌డౌన్ సమయంలో ప్రజలు ఎక్కువసేపు నిద్రించారని, కానీ ఆ విశ్రాంతిలో నాణ్యత కొరవడిందని తేల్చారు.
కొత్త వివరాలు.. ఇప్పుడు రెండో విడత డేటా లభ్యమవుతోంది. కొవిడ్ బారినపడటం వల్ల మన నిద్రపై ఎలాంటి ప్రభావం పడుతోంది? చివరికి అది మన కలల్లోకి ఎలా చొరబడుతోందన్నది వెలుగులోకి వచ్చింది. అందులోని అంశాల ప్రకారం..
కొవిడ్ బారినపడినవారిలో 52 శాతం మంది.. ఇన్‌ఫెక్షన్ సమయంలో నిద్రలో అవరోధాలు ఎదుర్కొన్నారు.
ఎక్కువ మందిలో కనిపించిన లోపం.. నిద్రలేమి (ఇన్‌సోమ్నియా). ఈ సమస్య ఉన్నవారు గాఢనిద్రలోకి వెళ్లలేకపోవడం లేదా ఆ స్థితిలో ఎక్కువసేపు కొనసాగలేకపోవడం జరుగుతుంది. చాలా సందర్భాల్లో వారు తెల్లవారకముందే మేల్కొంటున్నారు.
ఆందోళనకరమైన అంశమేమిటంటే.. ఇన్‌ఫెక్షన్ నుంచి కోలుకున్నాక కూడా వారిలో నిద్ర సమస్యలు కొనసాగుతున్నాయి. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన రెండు వారాల తర్వాత కూడా 26 శాతం మందిలో ఇన్‌సోమ్నియా ఉంటోంది.
కొవిడ్ పాజిటివ్‌గా తేలిన ఒక నెల తర్వాత కూడా బాధితులకు నిద్ర విషయంలో సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువే.
నిద్రలో ఇబ్బందులు.. లాంగ్ కొవిడ్.. కరోనా లక్షణాలు దీర్ఘకాలం కొనసాగే 'లాంగ్ కొవిడ్' బాధితుల్లో నిద్ర సమస్యలూ ఎక్కువ కాలం కొనసాగుతాయని స్పష్టమవుతోంది. 2021లో 3వేల మంది లాంగ్ కొవిడ్ బాధితులపై నిర్వహించిన ఒక అధ్యయనంలో తమకు నిద్ర సమస్యలు ఉన్నట్లు 80 శాతం మంది చెప్పారు. వీరిలో ఎక్కువగా ఉన్న ఇబ్బంది ఇన్‌సోమ్నియా.
ఇది ఆందోళనకరం. గాఢ నిద్ర మనలో అలసటను తగ్గించి, ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుంది. కొవిడ్ బాధితుల్లో కనిపిస్తున్న 'బ్రెయిన్ ఫాగ్'కు కొంతమేర ఈ తరహా విశ్రాంతి లోపించడమే కారణం.
నిద్రపై కొవిడ్ ప్రభావం ఇలా..
మెదడుపై కొవిడ్ ప్రత్యక్ష ప్రభావం ఉంటుంది. అందులో నిద్ర-మెలకువ దశలను నియంత్రించే ప్రాంతాలూ ఉన్నాయి. ఈ ఇన్‌ఫెక్షన్ కారక వైరస్.. కేంద్ర నాడీ వ్యవస్థలో ఇన్‌ఫెక్షన్ కలిగించడం లేదా మెదడులోని రక్తనాళ వ్యవస్థను ప్రభావితం చేయడం ఇందుకు కారణం కావొచ్చు.
కొవిడ్ వల్ల జ్వరం, దగ్గు, శ్వాసలో ఇబ్బందులు తలెత్తుతుంటాయి. వీటివల్ల కూడా నిద్రకు ఇబ్బంది కలగొచ్చు.
కరోనా బారినపడటం వల్ల కుంగుబాటు, ఆదుర్దా వంటి మానసిక సమస్యలు తలెత్తవచ్చు. ఏకాకిగా ఉండాల్సి రావడం, ఆసుపత్రుల్లో చేరాల్సి రావడం వంటివి ఆందోళన కలిగించొచ్చు. ఫలితంగా రెప్పవాలకపోవచ్చు.
కలలపైనా.. కొవిడ్‌తో కలలపై పడే ప్రభావాన్ని 'ఇంటర్నేషనల్ కొవిడ్ స్లీప్ స్టడీ' పేరిట 14 దేశాల శాస్త్రవేత్తలు పరిశోధించారు. ఇందులో కొవిడ్ నుంచి కోలుకున్నవారిని, ఆ వైరస్ బారినపడని వారిని సర్వే చేశారు. ఈ రెండు బృందాలకూ.. గతంతో పోలిస్తే కొవిడ్ ఆరంభమైన మొదట్లో ఎక్కువ కలలు వచ్చేవి. ఇన్‌ఫెక్షన్ బారినపడ్డవారికి ఎక్కువ పీడకలలు వస్తున్నట్లు తేలింది.
కొవిడ్ వల్ల పీడకలలు పెరగడానికి ఇతమిత్థమైన కారణాలు వెల్లడి కాలేదు. మానసిక ఆరోగ్యం సరిగాలేనప్పుడే సాధారణంగా ఇలాంటివి వస్తుంటాయి. కొవిడ్ సోకిన బృందంలో ఆదుర్దా, కుంగుబాటు లక్షణాలు కనిపించడంతో.. పీడకలలకు ఇవే కారణమై ఉంటాయని భావిస్తున్నారు.
ఉద్దేశపూర్వకంగా నిద్రను జాప్యం చేసే ఏకైక క్షీరద జాతి మానవులే.
నిద్రలేమి వల్ల నొప్పిని తట్టుకొనే సామర్థ్యం తగ్గిపోతుంది.
రాత్రివేళ విశ్రమించగానే నిద్రలోకి జారుకోవడానికి 10-15 నిమిషాలు పట్టాలి. ఐదు నిమిషాల కన్నా తక్కువ సమయం పడితే మనలో తీవ్ర అలసట, నిద్రలేమి ఉన్నట్టే.
ఆహారలేమి కన్నా నిద్రలేమి త్వరగా మరణానికి చేరువ చేస్తుంది.
12 శాతం మందికి కలలు బ్లాక్ అండ్ వైట్‌లోనే వస్తాయి.
నిద్రలేచిన 5 నిమిషాలకే.. మనం కన్న కలల్లో 50 శాతాన్ని మర్చిపోతాం. మరో ఐదు నిమిషాలు గడిస్తే అందులో 90 శాతం చెరిగిపోతాయి.
నివారణ ఎలా? స్వల్ప, దీర్ఘకాల ఇన్‌సోమ్నియాకు కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (సీబీటీ)తో చికిత్స చేయవచ్చు. చిన్నపాటి నిద్ర సమస్యలను కొన్ని సూత్రాల ద్వారా దూరం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అవి..
నిద్రించడం- మేల్కోవడంలో క్రమపద్ధతిని పాటించాలి.
కళ్లు మూతలు పడుతూ.. సహజసిద్ధంగా నిద్ర సంకేతాలు కలిగినప్పుడు పడకపైకి వెళ్లాలి. ఇదేరీతిలో మెలకువ భావన వచ్చినప్పుడు మంచం వీడాలి.
ఒత్తిడి భావనలు కలిగించే అంశాలను పరిమితం చేసుకోవాలి.