శాకాహారుల్లో కొవిడ్ వ్యాప్తి తక్కువగానే ఉంటుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. అంతేకాకుండా 'ఓ' రకం బ్లడ్ గ్రూప్ ఉన్నవారు కూడా వైరస్ బారినపడే అవకాశాలు తక్కువేనని తాజా సర్వేలో తేలింది. కరోనా వైరస్ను ఎదుర్కొనే యాంటీబాడీల స్థాయిను అంచనా వేసేందుకు కేంద్ర పరిశోధన సంస్థ సీఎస్ఐఆర్ చేసిన సర్వేలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి.
కరోనా వైరస్ను ఎదుర్కొనే యాంటీబాడీలు, వైరస్ను ఎదుర్కోవడంలో అవి ప్రతిస్పందించే సామర్థ్యాలను తెలుసుకునేందుకు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(సీఎస్ఐఆర్) దేశవ్యాప్తంగా సెరోసర్వే నిర్వహించింది. దేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన 140 వైద్య నిపుణులు, శాస్త్రవేత్తల బృందం ఆధ్వర్యంలో ఈ సర్వే చేపట్టింది. ఇందుకు దేశవ్యాప్తంగా ఉన్న 40 సీఎస్ఐఆర్ ల్యాబ్ల సిబ్బంది వారి కుటుంబీకులు మొత్తం 10,427 మంది సమాచారాన్ని విశ్లేషించారు.