బంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కాజల్ సిన్హా కరోనాతో మృతి చెందారు. రెండు రోజుల క్రితం కరోనా సోకి, ఆసుపత్రిలో చేరిన కాజల్ సిన్హా.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కాజల్ సిన్హా మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ.
ఎమ్మెల్యే అభ్యర్థి కాజల్ సిన్హా "కాజల్ సిన్హా కరోనాతో మరణించారు. ఇది చాలా బాధకరం. ఆయన మరణవార్త విని దిగ్భ్రాంతి చెందాను. ఆయన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో నిర్విరామంగా పాల్గొన్నారు. గొప్ప వ్యక్తిని కోల్పోయాం. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి."
- మమతా బెనర్జీ, టీఎంసీ అధినేత్రి
ఖర్దా నియోజకవర్గంలో టీఎంసీ తరుఫున బరిలోకి దిగారు కాజల్ సిన్హా. ఈ నెల 22న ఆ నియోజవర్గంలో ఎన్నికలు జరిగాయి. మే 2 ఎన్నికల ఫలితాలు రానున్నాయి.
కేంద్ర మంత్రికి రెండోసారి కరోనా
కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో రెండోసారి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. తన భార్యకు కూడా పాజిటివ్‌గా తేలిందని వెల్లడించారు. దీంతో ఈ నెల 26 జరగనున్న ఏడో విడత ఎన్నికల్లో పాల్గొనలేకపోవచ్చని తెలిపారు.
"నేను, నా భార్య.. కరోనా బారిన పడ్డాం. నాకు రెండోసారి వైరస్ సోకింది. పోలింగ్‌లో పాల్గొనలేకపోవచ్చు. ఇప్పటికే టీఎంసీ గూండాలు.. ఎన్నికలకు అంతరాయం కలిగించడానికి కుట్ర పన్నుతున్నారు." అని బాబుల్ ట్వీట్ చేశారు.
93 మంది నర్సింగ్ విద్యార్థులకు వైరస్
ఉత్తరాఖండ్ సుర్సింహా ధార్‌లోని ఓ ప్రభుత్వం నర్సింగ్ కళాశాలలో 93 మంది నర్సింగ్ విద్యార్థులకు కొవిడ్ సోకింది. ఓ హాస్టల్లో 200మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 93 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. మరో 65 మందికి నెగిటివ్‌గా తేలింది. మరి కొంతమంది ఫలితాలు రాలేదు. దీంతో ఆ హాస్టల్‌ను కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. నెగిటివ్ వచ్చినవారికి ఇళ్లకు పంపేశారు.
ఇదీ చూడండి:ఆదర్శ దంపతులు: మరణంలోనూ ఒక్కటై..!